ఘనంగా బోనాల పండుగ వేడుకలు
ఆదిలాబాద్, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ పట్టణంలో బోనాల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీలలో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషా సతీష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీ గార్డెన్ కాలనీ, సంజయ్‌నగర్ కాలనీ, అలాగే భుక్తాపూర్ వార్డు నంబర్ 45 పరిధిలో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బోనాల పండుగ మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. తరతరాలుగా మన గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ నిర్వహిస్తున్న పండుగల్లో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడం మన సంప్రదాయమన్నారు. రైతులకు మంచిగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, అమ్మవారి కృప అందరిపైనా ఉండాలని కోరారు. బోనాల పండుగ సందర్భంగా కాలనీల్లో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమాల్లో వార్డు కౌన్సిలర్ ఆత్రం వెంకటేష్, దశరథ్ పటేల్, కాలనీవాసులు, పట్టణ ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






