9 August, 2026 | 4:14 PM

రెచ్చిపోతున్న ప్రైవేట్ ఆంబులెన్స్ మాఫియా...?

09-08-2026 03:20 PM
  1. కమీషన్ల కోసం అంబులెన్స్‌ డ్రైవర్ల కక్కుర్తి....
  2. రోగుల ప్రాణాలతో చెలగాటం... ఆస్పత్రులకు కమీషన్‌ల బాట...
  3. రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారన్న ఆరోపణలు...
  4. బాన్సువాడ ఎంసీహెచ్‌ చుట్టూ ప్రైవేట్‌ అంబులెన్స్‌ల హల్‌చల్‌...
  5. అంబులెన్స్ డ్రైవర్ల కమీషన్ల దందాపై అధికారులు చర్యలు తీసుకునేనా...? 

బాన్సువాడ, ఆగస్టు 9(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకులు, డ్రైవర్ల  మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. ప్రవేట్ అంబులెన్స్ డ్రైవర్ల వ్యవహారశైలిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పేద కుటుంబo రోగులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు వచ్చే రోగులను ఏదో భయంకరమైన ఆందోళనకు గురిచేసి రోగులను ప్రవేట్ ఆసుపత్రులకు తరలించేలా కమీషన్ల కోసం తమకు అనుకూలమైన ప్రైవేట్‌ ఆస్పత్రులకు ప్రవేట్ అంబులెన్స్ డ్రైవర్లు తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా అంబులెన్స్ డ్రైవర్లు రాత్రి వేళలో ఆసుపత్రిలో ఉంటూ అత్యవసర సేవల పేరిట మాఫియా ఇష్టారాజ్యంగా తిరుగుతూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు లేకపోలేవని పలువురు రోగులు ఆరోపణలు చేయడం గమనార్హం. ప్రవేట్ అంబులెన్స్ డ్రైవర్లు కమిషన్ల దందా కొనసాగిస్తున్నారని రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మాఫియా రాజ్యాంగ కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. అంతేకాకుండా ఒక రోగినీ నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి ఉన్నప్పటికీ డ్రైవర్లు మాత్రం ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ కమిషన్ల కక్కుర్తికి పేద ప్రజల ప్రాణాలతో బేరాలు ఆడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు కమిషన్ల ఆశా చూపుతూ డ్రైవర్లను మచ్చిక చేస్తూ దంధానం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇలాంటి వ్యక్తులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ముఖ్యంగా ఎంసీహెచ్‌ ఆస్పత్రి పరిసరాల్లో ప్రైవేట్‌ అంబులెన్స్‌లు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండటంతో ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది.

రోగి దొరికితే చాలు

అత్యవసర పరిస్థితుల్లో రోగిని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చినప్పుడు కొందరు అంబులెన్స్‌ డ్రైవర్లు, నిర్వాహకులు కుటుంబ సభ్యుల నిర్ణయాలను పక్కనపెట్టి తమకు అనుకూలమైన ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్‌, హైదరాబాద్‌ బాన్సువాడ పట్టణంలో తదితర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులతో సంబంధాలు ఏర్పరచుకుని కమీషన్ల కోసం రోగులను తరలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

రూ.20 వేల వరకు కమీషన్‌?

బాన్సువాడ పట్టణ పరిధిలో సుమారు 30 వరకు ప్రైవేట్‌ అంబులెన్స్‌లు ఉన్నట్లు సమాచారం. కొందరు నిర్వాహకులు ప్రైవేట్‌ ఆస్పత్రులతో ఒప్పందాలు చేసుకుని ఒక్కో రోగిని తరలించినందుకు భారీగా కమీషన్లు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో కేసుకు రూ.20 వేల వరకు కమీషన్‌ తీసుకుంటున్నారన్న ప్రచారం ఉన్నప్పటికీ దీనిపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

కరోనా సమయంలో మొదలైందా?

కరోనా సమయంలో అత్యవసర సేవల్లో అంబులెన్స్‌ డ్రైవర్లు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులను తమ వద్దకు తరలించేలా అంబులెన్స్‌ నిర్వాహకులతో సంబంధాలు ఏర్పరచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇదే వ్యవహారం కమీషన్ల దందాగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.

ముందస్తు ఒప్పందాలపై ఆరోపణలు...

కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు అంబులెన్స్‌ నిర్వాహకులకు ముందుగానే డబ్బులు చెల్లించి తమ ఆస్పత్రులకు రోగులను తీసుకురావాలని ఒప్పందాలు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా రోగులను నిర్దిష్ట ఆస్పత్రులకు తీసుకెళ్తే బాధిత కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రిలో పర్యవేక్షణ ఏదీ...?

అంబులెన్స్‌లలో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వంటి అత్యవసర సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా? వాటిని నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందికి ప్రాథమిక వైద్య పరిజ్ఞానం ఉందా? అత్యవసర సమయంలో రోగికి అవసరమైన ప్రథమ చికిత్స అందిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రవేట్ అంబులెన్స్ డ్రైవర్ల పై చర్యలు తీసుకుంటాం: శ్రీనివాస్,సూపరిండెంట్, బాన్సువాడ ఏరియా ఆసుపత్రి

ప్రైవేట్‌ అంబులెన్స్‌ల వ్యవహారంపై బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు విజయ క్రాంతి  వివరణ కోరగా  ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించే అంబులెన్స్‌ డ్రైవర్లపై పూర్తి విచారణ చేపట్టి కమిషన్ల కోసం దందా కొనసాగిస్తున్న డ్రైవర్లపై చర్యలు తీసుకుంటాం.