2 May, 2026 | 2:38 AM

కార్మికులు హక్కులతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

02-05-2026 01:37 AM

కలెక్టర్ రాజర్షి షా..

ఆదిలాబాద్, మే 1 (విజయక్రాంతి) :  కార్మికులు తమ హక్కులతో పాటు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం స్థానిక ద్వారకానగర్ లోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మే డే వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల శంకర్ తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం కార్మికులకు శిక్షణ అందిస్తున్న పలువురు సిబ్బందికి ప్రశంసా పత్రం, మెమెంటోను అతిథులు అందజేశారు.   ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటుందని, ముఖ్యంగా భవన నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ...  సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. 

గత ప్రభుత్వాల హయాంలో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా కార్మికులకు రావాల్సిన ఈఎస్‌ఐ, పిఎఫ్ (PF) వంటి సౌకర్యాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందన్ కుమార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, ఐటిఐ ATO ఆర్.శ్రీనివాస్, మేస్త్రీ సంఘం నాయకులు బండారి పోశన్న, సామల సత్యనారాయణ, రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది, మేస్త్రిలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.