షాద్‌నగర్‌లో వాడి పోయిన కమలం
ఉమ్మడి పాలమూరులో పట్టున్న తప్పని పరాజయం
కానీ నడిపించే నాథుడేడి?
అంతర్గత పోరుతో కునారిల్లుతున్న బీజేపీ.. కార్యకర్తల్లో నైరాశ్యం!
షాద్‌నగర్, ఫిబ్రవరి 27( విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) పలు మున్సిపాలిటీల్లో గెలుపు జెండా ఎగురవేస్తూ తన సత్తా చాటుతున్నప్పటికీ, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ ము న్సిపాలిటీలో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఉమ్మడి మహబూబ్నగర్ (పాలమూరు) జిల్లాలో డీకే అరుణ (ఎంపీ) వంటి బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ, షాద్నగర్ కోటలో కమలం వికసించ కపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
స్థానిక నాయకత్వ లోపం....
రాష్ట్ర స్థాయిలో బలమైన నేతలు ఉన్నా, షాద్నగర్ స్థానిక కేడర్ను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు. అభ్యర్థుల ఎంపిక లో జాప్యం, వర్గపోరు పార్టీపై ప్రభావం చూపింది. ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్,బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఓటర్లు చీలిపోవడం, క్షేత్రస్థాయిలో బీజేపీ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోలేకపోవడం పార్టీకి మైనస్ అయ్యింది.
పాలమూరు నేతల ప్రభావం పరిమితం
డీకే అరుణ గద్వాల మరియు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పట్టున్న నాయకురాలు అయినప్పటికీ, రంగారెడ్డి జిల్లా పరిధి లోకి వచ్చే షాద్నగర్ రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఆమె చరి ష్మా ఓట్లుగా మారడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఉంటుందనే నమ్మకం ఉన్నా, షాద్నగర్లోని అన్ని వార్డులలో బలమైన కమిటీలు లేకపోవడం ప్రత్యర్థులకు కలిసొచ్చింది.
షాద్నగర్ నియోజకవర్గం లో అందే బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ వర్ధన్ రెడ్డిలు ఇలా ముగ్గురు ఉద్ధండులు ఉన్న చోట ‘కమలం’ వికసించాల్సింది పోయి, అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతోంది. ఇటీవల జరిగిన షాద్నగర్ మున్సిపాలిటీలో మొత్తం 28వార్డు స్థానాలు ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ 15, బీఆర్‌ఎస్ 11,బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థికి ఒక స్థానం గెలుపొందాయి.
అయితే నియోజకవర్గంలో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్నా, నాయకుల మధ్య సమన్వయం లేక కేడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇటీవల జరిగిన ము న్సిపల్ ఎన్నికల ఫలితాలు పార్టీలోని అసలు రంగును బయటపెట్టగా, నేతల మధ్య పెరిగిన దూరం సామాన్య కార్యకర్తను కలవర పెడుతోంది.పేరుకే ‘త్రిమూర్తులు’.. పనిలో ‘ఎవరికి వారే అనే అపవాదను మూట కట్టుకున్నారు. షాద్నగర్ నియోజకవర్గం లో బీజేపీలో అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డిలను త్రిమూర్తులుగా పిలుచుకుంటారు.
వీరికి వ్యక్తిగతంగా నియోజకవర్గంలో మంచి పట్టుంది. కానీ, పార్టీ కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్య వహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కంటే, సోషల్ మీడియాలో పోస్టు లు పెట్టడానికి, ప్రెస్ మీట్లు నిర్వహించడానికే అగ్రనేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోని స్థాయికి చేరడం పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో ‘ఫ్లాప్’ షో: 36 ఓట్ల పరాభవం...
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గాలిలో భారీగా ఓట్లు సాధించిన బీజేపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం చతికిలబడింది. నాయకుల సొంత వార్డుల్లోనే పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి నివాసం ఉండే 16వ వార్డులో పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 36. ఎమ్మెల్యే అభ్యర్థి అందే బాబయ్య ఇన్చార్జిగా ఉన్న 6వ వార్డులో కేవలం 127 ఓట్లే వచ్చాయి.ఒకవై పు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పుంజుకుంటున్న వేళ, షాద్నగర్లో మాత్రం అగ్రనేతల వార్డుల్లోనే డిపాజిట్లు గల్లంతవ్వడం చర్చనీ యాంశంగా మారింది.
గెలుపు అభ్యర్థిదే.. పార్టీది కాదు..
పట్టణంలోని 9వ వార్డులో గెలిచిన ప్యాట అశోక్ విజయం పూర్తిగా ఆయన వ్యక్తిగత ఇమేజ్ వల్ల వచ్చిందే తప్ప, పార్టీ వల్ల కాదని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. పార్టీలో గ్రూపు రాజకీయాలను భరించలేక పట్టణ బీజేపీ అధ్యక్షుడు హరి భూషణ్ పటేల్ ఇప్పటికే రాజీనామా చేశారు. గెలిచే అవకాశం ఉన్న చోట కూడా నాయకులు సహకరించకపోవడం వల్లే ఓడిపోయామని అభ్యర్థులు కన్నీరు మున్నీరవుతున్నారు.
దుష్ప్రచారం’ సాకుతో కాలక్షేపం?......
మరోవైపు, ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అని, తామంతా ఐక్యంగానే ఉన్నామని అగ్రనేతలు బుకాయిస్తున్నారు. కానీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు గ్రామ గ్రామాన తిరుగుతుంటే, బీజేపీ నేతలు మాత్రం కేవలం పట్టణానికి, మీడియా సమావేశాలకే పరిమితం కావడం పార్టీని బలహీనపరుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసే జనం, స్థానిక ఎన్నికల్లో ఎందుకు దూరం జరుగుతున్నారనే దానిపై సమీక్ష చేసే తీరిక కూడా ఈ ’త్రిమూర్తులకు’ లేకపోవడం గమనార్హం. నాయకులు కలిసి నడవకపోతే, మేము ఎవరి వెంట వెళ్లాలి? మా శ్రమకు గుర్తింపు ఏది?‘ అని సామాన్య కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా ఈ ‘త్రిమూర్తులు’ ఇగోలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వస్తారా? లేక ఇలాగే గ్రూపు రాజకీయాలతోషాద్నగర్లో కమలాన్ని కనుమరుగు చేస్తారా? అనేది వేచి చూడాలి.




