4 May, 2026 | 3:40 AM

ముంబై ఓటములకు బ్రేక్ పడేనా?

04-05-2026 02:23 AM
  1. లక్నోతో మ్యాచ్‌కు రెడీ
  2. వాంఖడేలో పరుగుల వరదే

ముంబై, మే 3: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా పేరు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా బోల్తా పడింది. పేలవ ఫామ్‌తో నిరాశపరిచింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి ఇప్పటి వరకూ 9 మ్యాచ్ లలో కేవలం రెండే విజయాలను సాధించింది. ఏడింటిలో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ అంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ , రికెల్టన్ , తిలక్ వర్మ ఇలా ఎవ్వరూ స్థాయికి తగినట్టు ఆడలేదు.

తిలక్ వర్మ ఒకటిరెండు మ్యాచ్‌లలో ఆడినా మిగిలిన మ్యాచ్ లలో మాత్రం నిరాశపరిచాడు. రోహిత్ శర్మ గాయంతో దూరమవడం కూడా ప్రభావం చూపింది. అటు బౌలింగ్‌లోనూ ఇదే పరిస్థితి. ఆశ్చర్యకరంగా స్టార్ పేసర్ బుమ్రా సీజన్ మొత్తం ఫ్లాప్ అయ్యాడు. దాదాపు ఆరు మ్యాచ్‌ల వరకూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బుమ్రా వైఫల్యం కూడా ముంబై వరుస ఓటములకు ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఓటమితోనే ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయింది.

మిగిలిన అన్ని మ్యాచ్ లూ గెలిచినా కూడా ఇతర జట్ల సమీకరణాలు కలిసొస్తే ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశ ముంటుంది. కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చి సమిష్టిగా రాణిస్తే ముంబై వరుస ఓటములకు బ్రేక్ పడే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈ సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయింది. 8 మ్యాచ్‌లు ఆడిన లక్నో రెండు విజయాలు సాధించగా.. ఆరింటిలో ఓడిపోయింది. ప్రస్తు తం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పై గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకోవడం లక్నో అభిమానులకు షాక్ ఇచ్చింది. కెప్టెన్ గానూ, బ్యాటర్ గానూ రిషబ్ పంత్ ఘోరంగా విఫలమవుతున్నాడు. మిఛెల్ మార్ష్ , మార్కరమ్, పూరన్ , ఆయుశ్ బదోనీ వంటి హిట్టర్లు ఉన్నా నిలకడ లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఒక మ్యాచ్ ఆడితే నాలుగు మ్యాచ్‌లు సింగిల్ డిజిట్‌కే ఔట్ అవుతున్నారు. అటు బౌలింగ్‌లో షమీ రాణిస్తున్నా మిగిలిన బౌలర్ల నుంచి పూర్తి సపోర్ట్ దక్కడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమిష్టిగా రాణిస్తే తప్ప లక్నో గెలుపు సాధించే పరిస్థితి కనిపించడం లేదు. వాంఖడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది.

తుది జట్లు అంచనా

ముంబై ఇండియన్స్ : విల్ జాక్స్, రికెల్టన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), రాబిన్ మింజ్, క్రిస్ భగత్, బౌల్ట్ , బుమ్రా, ఘజన్‌ఫర్ 

లక్నో సూపర్ జెయింట్స్ : మిఛెల్ మార్ష్ , బదోనీ, పంత్ (కెప్టెన్), మార్క్మ్,్ర పూరన్, ముకుల్ చౌదరి, హిమ్మత్ సింగ్, జార్జ్ లండే, దిగ్వేశ్ సింగ్, మోసిన్ ఖాన్, మహ్మద్ షమీ