హోల్డర్ మ్యాజిక్
- గుజరాత్ హ్యాట్రిక్ విజయం
- పంజాబ్‌కు మరో ఓటమి
ఐపీఎల్ 19వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. టాప్ ప్లేస్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గుజరాత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో జాసన్ హోల్డర్ , బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టడంతో పంజాబ్‌కు మరో ఓటమి తప్పలేదు.
అహ్మదాబాద్, మే 3: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత ఓటమి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో విఫలమైంది. ఫామ్ లో ఉన్న ప్రియాన్ష్ ఆర్య(2), ప్రభ్ సిమ్రన్ సింగ్ (15) పరుగులకే ఔటయ్యారు. కూపర్ కన్నోలీ, నేహల్ వధేరా డకౌటవడం, శ్రేయాస్ అయ్యర్ కూడా 19 పరుగులకే ఔటవడంతో పంజాబ్ కేవలం 47 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సుయాన్ష్ షెడ్జే, స్టోయినిస్ పంజాబ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ఆరో వికెట్ కు 79 పరుగులు జోడించారు. తొలిసారి సుయాన్ష్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
కేవలం 29 బంతుల్లోనే 57 ( 3 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేయగా.. స్టోయినిస్ 31 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. అయితే గుజరాత్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా హోల్డర్ కీలక సమయంలో వికెట్లు తీసి దెబ్బకొ ట్టాడు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ 163 పరుగులకే పరిమితమైంది. హోల్డర్ 4 , రబాడ 2, సిరాజ్2 వికెట్లు పడగొట్టారు.ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ (5) నిరాశపరిచాడు.
అయితే సాయి సుదర్శన్, బట్లర్ రెండో వికెట్ కు 53 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడే క్రమంలో బట్లర్ (26) పరుగులకు ఔటవగా, నిశాంత్ సింధు(15) కూడా నిరాశపరచడంతో గుజరాత్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ 30 పరుగులే జోడించినా తర్వాత బ్యాటర్లపై ఒత్తిడి తగ్గింది. అనంతరం సాయి సుదర్శన్ (57) ఔటైనా, వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రాహుల్ తెవాటియా(2), హోల్డర్ (5) ఔటవడంతో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 40 (5 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
స్కోరు బోర్డు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 163/9 (సుయాన్ష్57, స్టోయినిస్ 40, మార్కో జెన్సన్ 20 ; హోల్డర్ 4/24, సిరాజ్ 2/28, రబాడ 2/22)
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 167/6 ( సాయి సుదర్శన్ 57, బట్లర్ 26, వాషింగ్టన్ సుందర్ 40 నాటౌట్ ; అర్షదీప్ సింగ్ 2/24, విజయ్ కుమార్ వైశాఖ్ 2/31)






