20 March, 2026 | 3:33 AM

ఆశలు ఫలించేనా?

20-03-2026 12:00 AM
  1. భూదాన్ భూమి ఇండ్ల కూల్చివేతపై హైకోర్టు సంచలన తీర్పు

311 మందికి కాదు.. అందరికి న్యాయం చేయాలని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం

భూదాన్ బాధితుల ముఖాల్లో ఆనందం

పేదలకు న్యాయం చేయాలని కోరుతున్న ప్రజా సంఘాలు

ఖమ్మం(కూసుమంచి), మార్చి 19,(విజయక్రాంతి): భూదాన్ భూ నిర్వాసితుల ఆశలు సజీవంగా నిలిచినట్లేనా..? ఉన్నఫలంగా ప్రభుత్వం కూల్చేసిన ఇండ్లతో రోడ్డున పడిన నిరుపేదలకు హైకోర్టు అండగా నిలిచిందా..? 311 మందికి కాదు.. నిర్వాసితులందరికి న్యాయం చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందా..? దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన భూదాన్ భూమి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది..?

ఇప్పటికే పట్టాలిచ్చామని చేతులు దులుపుకుంటుందా..? హైకోర్టు ఆదేశాలను పాటించి మరింత మందికి న్యాయం చేస్తుందా..? భూదాన్ భూ అంశంపై ‘విజయక్రాంతి’ అందించే ప్రత్యేక కథనం..  ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూమిలో వందలాధి మంది పేదలు, మధ్యతరగతి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన చాలా మంది నిరుపేదలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొందరు డేరాలు, రేకుల షెడ్లు వేసుకుని నివాసం ఉంటుండగా, మరికొందరు చిన్న సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం చేసుకున్నారు. సుమారు 10ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని భూ నిర్వాసితులు చెబుతున్నారు. ఇందులో భూదాన్ భూమి కమిటీ కొందరు పట్టాలను మంజూరు చేయగా, మరి కొంత మంది నాయకుల ధీమాతో అక్కడ స్థలాన్ని అక్రమించుకుని నివాసం ఉంటున్నారు.

అయితే గత కొద్ది రోజుల క్రితం భూ నిర్వాసితుల నివాసాలను ప్రభుత్వాధికారులు వన్ టైమ్ లో జేసీబీల సహాయంతో కూల్చివేశారు. వందలాధి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించి చిన్న గుడిసెలతో పాటు నివాసాలన్ని పూర్తిగా జేసీబీల సహాయంతో కూల్చేశారు. ఈ సమయంలో భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి తేలిసిందే.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చేశారని నిర్వాసితులు చెబుతుంటే, కచ్చితంగా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే పేదల ఇండ్లను తొలగించాల్సి వచ్చిందని అధికారులు చెబుతు న్నారు. ఈ సమయంలో ప్రభుత్వంపై భారం పడినట్లైంది.. కోర్టు ఆదేశాలున్నప్పటికి ప్రభుత్వమే పనిగట్టుకుని కూల్చేసిందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, బాధితులు ఆరోపించారు. భూదాన్ భూమి ఇండ్లను కూల్చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

311 మందికి ఇండ్లు, ఇండ్ల స్థలాన్ని మంజూరు చేసిన ప్రభుత్వం 

భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేద ప్రజలందరికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హామిఇచ్చారు. దీంతో వెంటనే ప్రభుత్వాధికారులతో ఇంటింట సర్వే చేసిన ప్రభుత్వాధికారులు 311 మంది అర్హులుగా గుర్తించి వారందరికి భూమి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారు.

అర్హత కల్గిన పేదలందరికి న్యాయం చేస్తున్నామని, 311 మందితో పాటు అర్హత కల్గిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముగ్గురు మంత్రులు హామి ఇచ్చారు. అలాగే వెలుగుమట్లలో మోడల్ కాలనీ నిర్మాణం చేస్తామని మంత్రులు హామి ఇచ్చారు. మాటిచ్చినట్లుగా విద్యుత్ సౌకర్యం, తాగునీటి పైప్ లైన్, సీసీ రోడ్ల నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. అయినప్పటికి భూ నిర్వాసితుల తరుపున సుమారు 12 మంది హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.. 

సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు

ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూమిలో పేదల ఇండ్లు కూల్చివేత విషయంలో పిటిషన్ ను తీసుకున్న హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు ఉగాదికి ఒక్క రోజు ముందు సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు భూ నిర్వాసితులకు ఉగాది పండుగ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేతను తప్పు పట్టిన హైకోర్టు, కూల్చేసిన ప్రతి ఇంటి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేయకుండా, సర్వే చేయకుండా ఉన్నఫలంగా ఇండ్లను కూల్చేసి, అందులో కొంత మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు, సూటిగా తీర్పు ఇచ్చింది. ఎంత మంది ఇండ్లను కూల్చేశారో, వారందరికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆదేశించింది. దీంతో ఈ తీర్పు సంచలనంగా మారింది.. 

నిరుపేదలకు న్యాయం జరిగేనా..? 

భూదాన్ భూమి విషయంలో ఇండ్లను కూల్చేవేతపై హైకోర్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో వెలుగుమట్ల భూదాన్ భూ నిర్వాసితుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు మాకు ఉగాది కానుక ఇచ్చిందని సంతోషపడుతున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందా..? అనేది ప్రశ్నార్థికంగా మారింది. వెలుగుమట్లలోని భూదాన్ భూమితో పాటు ప్రభుత్వ స్థలంలో కూడా నిరుపేదలకు ఇండ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. వారందరి ఇండ్లను ప్రభుత్వం కూల్చేసింది. అధికారికంగా సుమారు 700 పైగా ఇండ్లను ప్రభుత్వం కూల్చేసినట్లు తెలుస్తోంది.

అనాధికారికంగా మరో 200 ఇండ్లను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అందరికి న్యాయం చేస్తుందా..? లేదంటే సుఫ్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అయితే భూదాన్ నిర్వాసితులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేస్తుందా..? వేచి చూడాల్సిందే మరీ..?