అభివృద్ధి నిధులు జీతాలకు మళ్లిస్తారా
- నిధులను దారిమళ్లిస్తే ఊరుకునేది లేదు
- తీరు మార్చుకోకుంటే కేంద్రానికి లేఖ రాస్తా
- కార్గిల్ చెరువు పునరుద్దరణ పనులకు శంకుస్థాపన
- కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
సిరిసిల్ల, జూలై 17 (విజయక్రాంతి): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సర్పంచులను బెదిరించి, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు.
అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను కరెంట్ బిల్లులు, జీతాలకు ఎట్లా మళ్లిస్తారు? ఇది నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమచేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులు, సిబ్బంది జీత భత్యాలకు కూడా నిధులివ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అని మండిపడ్డారు.
శుక్రవారం సిరిసిల్లలో కేంద్రమంత్రి పర్యటించారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, పలువురు ఉన్నతాధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి అమృత్ 2 పథకం కింద రూ. 1.32 కోట్లతో చేపట్టిన కార్గిల్ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. పక్కనే ఉన్న కార్గిల్ యుద్ధ శకటాన్ని సందర్శించారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించి జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేశారు.






