ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శ్రీ విజయ్ చందర్ రైస్ మిల్లును మూసేయించాలి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు
గరిడేపల్లి, జూలై 17 : మండలంలోని రాయినిగూడెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిని 167 ను ఆనుకొని ఉన్న శ్రీ విజయ్ చందర్ రైస్ మిల్ వలన వచ్చే దుమ్ము, ధూళి, వరి పొట్టు కళ్లలో పడటం కారణంగా వాహనాలపై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతూ క్షతగాత్రులై వికలాంగులు అవుతున్నందున అధికారులు ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఆ రైస్ మిల్ ను మూసేయించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు కోరారు.
మండలంలోని గానుగబండ గ్రామంలో శుక్రవారం జరిగిన సిపిఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రైస్ మిల్లు నిర్మాణంలో సరియైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోగా చుట్టూ కనీసం రక్షణ గోడ కూడా కట్టలేదన్నారు. ఇప్పటికే రెండు, మూడు అత్యంత ప్రమాదాలు జరిగాయన్నారు. మిల్లుకు అమర్చిన ఇనుప రేకులపై ఎటువంటి రక్షణ గోడ కట్టకపోవడంతో అవి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులపై పడి కాళ్ళు, చేతులు విరిగి గాయాల పాలై అదృష్టవషత్తు ప్రాణాలతో బయటపడ్డ సందర్భాలు ఉన్నాయన్నారు.
అయినా ఈ మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించాలనే సోయి లేకుండా ప్రవర్తించడం బాధాకరమన్నారు. నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నడుపుతున్న ఈ మిల్లుపై అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకో కపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
ప్రజల ప్రాణాల కంటే మిల్లు విలువైనదేమీ కాదని అందుకే అధికారులు స్పందించి వెంటనే రైస్ మిల్లును మూసేయించడంతో పాటు మిల్లు అనుమతులు రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కుందూరు వెంకటరెడ్డి, పోకల ఆంజనేయులు, గోధుమల ఈశ్వర చారి, పంగ సైదులు, షేక్ నబి సాహెబ్, సోమయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.






