calender_icon.png 9 February, 2026 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ విద్యార్థిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న కీచక ఉపాధ్యాయుడు

09-02-2026 06:21:09 PM

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల కీచకులుగా మారుతున్నారు

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ సర్కిల్,  పోచారం డివిజన్ అన్నోజిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువే కీచకుడిగా మారాడు. తన దగ్గర చదువుకుంటున్న మైనర్ బాలికపై కన్నేసి, ప్రేమ పేరుతో వంచించి, రహస్యంగా పెళ్లి చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, నిజం ఎక్కువ రోజులు దాగదు కాబట్టి అసలు విషయం బయటపడింది.

 అసలు ఏం జరిగింది

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ఎల్ఐజీ కాలనీ మార్గంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో పర్రే మైటీన్ (27) భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా  పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిని అతను తన మాటలతో ట్రాప్ చేశాడు. ఈ క్రమంలోనే ఆ బాలికకు మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న సమయంలో విద్యార్థిని మెడలో పసుపు తాడు (తాళి) ఉండటాన్ని గమనించిన తల్లి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

కూతురిని గట్టిగా నిలదీయగా, తన ఫిజిక్స్ టీచర్ పర్రే మైటీన్ తనను పెళ్లి చేసుకున్నాడని అసలు నిజం ఒప్పుకుంది. దీంతో కంగుతిన్న తల్లిదండ్రులు తక్షణమే పాఠశాల ప్రిన్సిపల్‌ను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నిలదీతతో మొదట తనకు ఏమీ తెలియదని ప్రిన్సిపల్ బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే, సదరు ఉపాధ్యాయుడిని పిలిపించి అడగగా, అవును, నేను ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. విషయం బయటకు పొక్కితే పాఠశాల పరువు పోతుందని భావించిన యాజమాన్యం, గోప్యంగా ఉంచుతూనే నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు పర్రే మైటీన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నమ్మకంతో చదువు కోసం పంపిస్తే, కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. ఇటువంటి కీచక గురువులకు కఠిన శిక్ష పడాలి" అని బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థినుల భద్రతపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. యాజమాన్యం ఇలాంటి విషయాలను దాచిపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.