భారీ వర్షాలకు ఉప్పొంగిన విలోచవరం వాగు
మంథనికి నిలిచిపోయిన రాకపోకలు
మంథని,జులై 30(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) మంథని మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(heavy rains) కారణంగా మంథని మండలంలోని విలోచవరం వాగు(Vilochavaram Village) ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో రహదారిపైకి భారీగా వరద నీరు చేరుకొని, మంథనికి వెళ్లే సాధారణ వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వాగు ప్రవాహం పెరగడంతో విలోచవరం, దాని పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంథని పట్టణానికి చేరుకోవాలంటే స్థానికులు పోతారం,ఉప్పట్ల, గుంజపడుగు గ్రామాల మీదుగా సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ దూరం మరియు సమయం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున, స్థానికులు లేదా వాహనదారులు ఎవరూ సాహసించి వాగును దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు స్పష్టం చేశారు.
అత్యవసర సేవలు మినహా, ఇతర ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, కాలువలు, పొంగిపొర్లుతున్న వాగుల వద్దకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.






