9 June, 2026 | 2:45 AM

రాహుల్‌జీ మౌనమేల!

09-06-2026 01:02 AM

సీఎం రేవంత్ ‘హిట్లర్’ వ్యాఖ్యలను సమర్థిస్తున్నవా?

  1. హైడ్రాకు హంతక ముఠా ఎలా స్ఫూర్తి? 
  2. ఏఐసీసీని నాజీ పార్టీగా మార్చండి 
  3. మొహబ్బత్ కీ దుకాణ్ కాస్తా హిట్లర్ కా మకాన్ అయ్యిందా?
  4. రాహుల్‌గాంధీని ‘ఎక్స్’ వేదికగా నిలదీసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ 

హైదరాబాద్, జూన్8(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన ‘హిట్లర్’ వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)ని ‘ఆల్ ఇండియా నాజీ పార్టీ’గా మార్చుకోవాలని ఆయన సూచించారు. దీంతో జాతీ య, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది.

ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇచ్చే జాతీయ నినాదం ‘మొహబ్బత్ కీ దుకాణ్’ (ప్రేమ దుకాణం) కాస్తా, ఆయన స్వయంగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి క్రూర నియంత వారసత్వాన్ని అక్కున చేర్చు కోవడంతో తెలంగాణలో ‘హిట్లర్ కా మకాన్’ (హిట్లర్ ఇల్లు)గా మారిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నైతికతలోని ద్వంద్వ ప్రమాణాలను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రభుత్వ పాలనా విధానాలకు, హైడ్రా పేరిట కట్టడాల కూల్చివేతలకు జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్, ఆయన ‘హంతక ముఠా‘ (అస్సాస్సినేషన్ స్క్వాడ్) స్ఫూర్తి అని బహిరంగంగా పేర్కొనడంతో ఈ రాజకీయ వివాదం చెలరేగింది. అంతేకాకుండా, ఈ స్థానిక కూల్చివేతలను అంతర్జాతీయ యుద్ధ ప్రాంతాల విధ్వంసంతో ఎంతో గర్వంగా పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సోమవారం సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ నేరుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని టార్గెట్ చేశారు.

సీఎం రేవంత్ ఫాసిస్ట్ విధానాలపై స్పందించిన కేటీఆర్.. సీఎం చేసిన వ్యాఖ్యలు వారి ఫాసిస్టు పాలనా ఆలోచనా విధానానికి నిదర్శనమని, ఇది దేశ పునాది విలువలపై జరిగిన క్షమించరాని దాడి అని మండిప డ్డారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ వహిస్తున్న వ్యూహాత్మక మౌనాన్ని వీడాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిని మందలించకపోతే, ఆ నియంతృత్వ పద్ధతులను అధిష్ఠానం సమర్థించినట్లే అవుతుందని హెచ్చరించారు.

‘డియర్ రాహుల్ గాంధీ జీ.. మీ’ మొహబ్బత్ కీ దుకాన్’ అధికారికంగా ‘హిట్లర్ కా మకాన్’ అయిందా..? తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా క్రూర హిట్లర్‌ను కీర్తిస్తూ, అతని ‘హంతక ముఠా’లను పాలనా స్ఫూర్తిగా పేర్కొంటుంటే.. మీరు మౌనంగా ఉంటూ, ఢిల్లీలో రాజ్యాంగానికి తానే స్వయంప్రకటిత రక్షకుడినని ఎలా చెప్పుకుంటారు? అని కేటీఆర్ తన పోస్ట్‌లో నిలదీశారు. ఒక ప్రజాస్వామ్య నాయకుడు నిజమైన రాజనీతిజ్ఞుల నుంచి స్ఫూర్తి పొందుతాడని, కేవలం అధికారం తలకెక్కిన, పారనాయిడ్ పాలకుడు మాత్రమే క్రూర నియంతల నుంచి పాఠాలు వెతుక్కుంటా డని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

‘ఆల్ ఇండియా నాజీ పార్టీ’గా మార్చుకోండి

కేంద్ర కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలను మరింత తీవ్రం చేస్తూ.. నియంతృత్వ పద్ధతులను పండగ చేసుకోవడం, స్థానిక నివాసాలను యుద్ధ ప్రాంతాలలా మార్చడమే ఆ పార్టీ అసలు సిసలైన పాలనా బ్లూప్రింట్ అయితే, వారు సిద్ధాంతాల ముసుగును పూర్తిగా తొలగించుకోవాలని కేటీఆర్ సూచించారు. ‘నియంతృత్వ పద్ధతులను సెలబ్రేట్ చేసుకోవడం, స్థానిక కూ ల్చివేతలను అంతర్జాతీయ యుద్ధ ప్రాంతాల వి ధ్వంసంతో గర్వంగా పోల్చడమే మీ పార్టీ అసలు పాలనా విధానం అయితే.. ఏఐసీసీ తన సిద్ధాంతాల ముసుగును తీసివేసి ‘ఆల్ ఇండియా నాజీ పార్టీ’గా పేరు మార్చుకోవాలి.

మీ మౌనం ఈ వ్యాఖ్యలను అంగీకరించినట్లే అవుతుంది. దేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తోంది’ అని కేటీఆర్ ముగించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఖండిస్తున్న తరుణం లో.. కాంగ్రెస్ హైకమాండ్ నిజంగానే నాజీ పద్ధతులను తమ పాలనా విధానంగా అంగీకరిస్తోం దా లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.