విజయ్‌తో కలిసొచ్చేది ఎవరు?
- మ్యాజిక్ ఫిగర్ కోసం వెతుకులాట!
- తమతో కలిసిరావాలని కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి పిలుపు
- ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సహా పీఎంకే, డీఎండీకే, లెఫ్ట్ పార్టీల మద్దతు!
చెన్నై, మే 4: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత ఉత్కంఠను రేపుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే టీవీకే వందకు పైగా స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి చేరువలో నిలిచిపోయింది. తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో విజయ్ ఘన విజయం సాధించారు.
అయితే ఆయన పార్టీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపదని, ఓట్లు చీల్చే అవకాశం ఉందని కొందరు, ఒకవేళ హంగ్ వస్తే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్, కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను విజయ్ తారుమారు చేశారు. అత్యధిక స్థానాలు సాధించి, తమిళనాడులో పెద్ద పార్టీగా ఉన్న టీవీకే నుంచి సీఎం రేసులో విజయ్ ఉండటం దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఎక్కడి నుండి లభిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. స్థానిక మీడియా కథనాల ప్రకారం కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే, లెఫ్ట్ పార్టీలు విజయ్‌తో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, డీఎండీకే, లెఫ్ట్ పార్టీలతో పాటు ఎన్డీయే కూటమిలో ఉన్న అన్బుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకే మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్‌కు టీవీకే ఆహ్వానం పంపినప్పటికీ, వారు డీఎంకేతోనే కలిసి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో కలిసి రావాలని విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్‌కు పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, పీఎంకే, లెఫ్ట్ పార్టీల మద్దతు లభిస్తే విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమవుతుంది. చిన్న చిన్న పార్టీల మద్దతుతో వచ్చే ఇబ్బందులు లేకుండా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే, అన్నాడీఎంకేతో కలిసే అవకాశాన్ని కూడా రాజకీయ వర్గాలు కొట్టిపారేయడం లేదు. దళపతి విజయ్ మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి ఏ దారిని ఎంచుకుంటారో, ఎవరితో జతకడతారో తెలియాలంటే మరికొద్ది గంటల వరకు వేచి చూడాల్సిందే.






