జంగిల్‌రాజ్‌కు చరమగీతం
- బంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు
- బీజేపీకి ఘన విజయం కట్టబెట్టారు
- శ్యామప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి లభించింది..
- పార్టీకి ఇది చారిత్రాత్మక రోజు
- కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేకు మహిళలు గుణపాఠం చెప్పారు..
- పార్టీ విజయోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, మే ౪: బంగాల్‌లో మమతా బెనర్జీ మహా జంగిల్‌రాజ్‌కు చరమగీతం పాడామని, బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బంగాల్ ప్రజలకు నిజమైన భరోసా దొరికిన రోజు అని అభిప్రాయపడ్డారు. ఇక హింస అనే పీడ బంగాలీయులకు తొలగిపోయిందని వ్యాఖ్యానించారు. బంగాల్‌తోపాటు అసోం ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయంపై సోమవారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవాలకు ఆయన హాజరయ్యారు.
వేడుకలకు ఆయన పంచెకట్టుతో విచ్చేశారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బంగాల్‌లో ప్రజాశక్తి గెలిచిందని, వారు మార్పు కావాలని కోరుకుని బీజేపీని గెలిపించారని కొనియాడారు. ఈగెలుపుతో శ్యామప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి లభిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ సుపరిపాలన రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారని శ్లాఘించారు. బెంగాల్ ప్రజల కలలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో హింసకు తావు లేకుండా పాలన అందిస్తామని వెల్లడించారు. తమకు ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని లేదని, కేవలం మార్పు మాత్రమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. విజయంలో బీజేపీ కార్యకర్తల కృషి ఉందని కొనియాడారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. బెంగాల్ గెలుపుతో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించినట్లయిందని చమత్కరించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ సరసన ఇప్పుడు బెంగాల్ కూడా చేరిందని వివరించారు.
దేశంలో ప్రస్తుతం ౨౦కి పైగా బీజేపీ, ఎన్డీయే కూటమి ప్రభుత్వాలున్నాయని వివరించారు. బెంగాల్ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. విజన్, వికాస్.. ప్రస్తుతం నేటి యువతకున్న లక్ష్యాలని వివరించారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేకు మహిళలు తగిన గుణపాఠం చెప్పారని చురకలంటించారు. అసోంలో బీజేపీ విజయంపైనా ప్రధాని స్పందించారు. అభివృద్ధిపై తాము చూపుతున్న శ్రద్ధకు ప్రజలు మళ్లీ మద్దతు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో టీవీకే ఘనవిజయంపై ఆయన స్పందిస్తూ, పార్టీ అధినేత విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కేరళలో యూడీఎఫ్ విజయంపై ఆ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. పుదుచ్చేరి ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై మరోసారి నమ్మకం ఉంచారని వ్యాఖ్యానించారు.






