ఉన్నత పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు!
- విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన
- షీటీంకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు
- చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం
- కీచక ఉపాధ్యాయునికి ఉపాధ్యాయుల అండ
- విచారణ చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు
- జిల్లా కలెక్టర్ స్పందించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి
పాపన్నపేట, ఆగస్టు 30 : మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ అంటారు.. తల్లిదండ్రుల తరువాత అంతటి స్థాయి గురువులది. పిల్లలకు విద్యాబుద్ధులు(education and moral values) నేర్పించి జీవితంలో సక్రమ మార్గం వైపు అడుగులు వేయించే బాధ్యత ఉపాధ్యాయులది(teacher). అయితే కొందరు చేసే నీచమైన చర్యల వల్ల ఉపాధ్యాయ వృత్తి(teaching profession)కే మచ్చ తెచ్చేలా ఉంటున్నాయి.
కన్న బిడ్డల వలె కంటికి రెప్పలా చూసుకోవలసిన విద్యార్థులను(students) కొందరు ఉపాధ్యాయులు లైంగికం(sexual)గా వేధిస్తున్న ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాపన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 7న పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులచే విద్యార్థినులకు జీసీఈసీ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ అవగాహన కార్యక్రమంతో విద్యార్థినులకు అవగాహన రావడంతో మహిళ ఉపాధ్యాయులకు ఆ కీచక ఉపాధ్యాయుడు ప్రవర్తించే తీరుపై గోడును వెళ్ళబోసుకున్నారు. 9, 10 వ తరగతి విద్యార్థులు చెప్పిన విషయాలతో ఆ మహిళా ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు. ఎక్కడపడితే అక్కడ తాకడంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని అలా అతని ప్రవర్తనపై చెప్పుకొచ్చారు. ఇట్టి విషయాన్ని మహిళా ఉపాధ్యాయులు పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు చెప్పడంతో అందరూ కలిసి ఆ కీచక ఉపాధ్యాయుడిని మందలించారు.
విద్యార్థినులు నేరుగా షీ టీం, తదితర హెల్ప్ డెస్క్ లకు ఫోన్ ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యను వెళ్ళబోసుకున్నారు. దీంతో పాఠశాలకు చేరుకున్న షీటీం, తదితర సభ్యులు విద్యార్థినులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందించనున్నట్లు సమాచారం. ఈ విషయం ఉన్నత పోలీసు శాఖకు సైతం తెలవడంతో వారు సదరు కీచక ఉపాధ్యాయుడిని పిలిపించి మందలించినట్లు సమాచారం.
ఐసిడిఎస్ అధికారులు కూడా పాఠశాలలో క్షేత్రస్థాయి విచారణ జరిపారు. ఇలావుండగా సదరు కీచక ఉపాధ్యాయుడు 2024 లో ప్రమోషన్ పై మండలంలోని ఓ పాఠశాల నుంచి ఈ పాఠశాలకు వచ్చాడు. ఎంతో బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉంటూ ఇలా వక్రబుద్ధి కలిగిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపడితేనే మార్పు వస్తుందని విద్యార్థినీల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసినా.. చర్యలు ఎక్కడ?
బాలికలకు సంబంధించిన సున్నితమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదు అందిన వెంటనే విద్యార్థినుల భద్రతకు చర్యలు తీసుకున్నారా? వారి వాంగ్మూలాలు నమోదు చేశారా? అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా 20 మందికి పైగా విద్యార్థినులను వేధిస్తున్న విషయం ఫిర్యాదు అందినా నేటికీ చర్యలు లేవు.
ఇందుకు కారణం ఇద్దరు ఉపాధ్యాయుల సహకారంతో కీచక టీచర్ చేష్టలను బయటకు పొక్కనీయకుండా కాపాడుతున్నారని తెలుస్తోంది. స్థానికుడైన టీచర్ అంతా నేను చూసుకుంటా..ఏం కాదు అన్న భరోసా ఇవ్వడం తోనే తప్పు చేసిన ఉపాద్యాయుడు నాకేం కాదన్న భరోసాతో ఉన్నట్టు తెలుస్తోంది.
విచారణలో జాప్యంపై అనుమానాలు ?
ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు, బాలల సంక్షేమ అధికారులు, పోలీసులు సమన్వయంతో విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులు ఎలా పాస్ అవుతారో చూస్తా అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్టు తెల్సుస్తోంది.
దీంతో విద్యార్థినిలు సైతం భయాందోనలకు గురవుతున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విచారణ చేశాం..
పాపన్నపేట ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయుడి చేష్టలపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. పూర్తిస్థాయి నివేదిక జిల్లా కలెక్టర్ కు అందించాం. కలెక్టర్ తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
- హేమభార్గవి, డీడబ్ల్యువో మెదక్






