జిల్లాలో ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై కొరడా
38 మంది రైస్ మిల్లర్ల వద్ద రూ.238 కోట్ల బకాయిలు
7 క్రిమినల్ కేసులు.. ఒకరిపై పీడీ యాక్ట్.. 31 మిల్లుల్లో పంచనామా
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రభుత్వ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకుని, నిబంధనల ప్రకారం సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా బకాయిలు పెట్టిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం, సీఎంఆర్ బకాయిల విషయంలో ఎలాంటి అవకతవకలను సహించబోమని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్‌కు సంబంధించి 38 మంది రైస్ మిల్లర్ల వద్ద సుమారు రూ.238 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం, తరలింపు, లెక్కల్లో చూపకపోవడం తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ రికార్డులను పరిశీలిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వ ధాన్యం వ్యవహారంలో 7 క్రిమినల్ కేసులు నమోదు చేయగా, ఒకరిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో 31 రైస్ మిల్లుల్లో ప్రభుత్వ ధాన్యం నిల్వలు, సీఎంఆర్ డెలివరీ, రికార్డులపై పంచనామా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
సుగ్లాంపల్లి మిల్లులో భారీ డిఫాల్ట్
సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలోని లక్ష్మీ ఇండస్ట్రీస్‌పై ఆగస్టు 6న నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వ ధాన్యం నిల్వలు భౌతికంగా అందుబాటులో లేనట్లు గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. 2023–24 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మొత్తం 7,493.610 మెట్రిక్ టన్నుల ధాన్యం డిఫాల్ట్‌గా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. 25 శాతం పెనాల్టీతో కలిపి రూ.24.18 కోట్ల మేర డిఫాల్ట్ మొత్తం ఉన్నట్లు తెలిపారు.
ఈ వ్యవహారంలో సంబంధిత మిల్లర్ ప్రభుత్వ ధాన్యాన్ని సక్రమంగా లెక్కించకపోవడం, సీఎంఆర్ బియ్యాన్ని అందించకపోవడం వంటి అంశాలపై టీజీఎస్‌సీఎస్‌సీఎల్ జిల్లా మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వ ధాన్యం ప్రజాధనం ద్వారా కొనుగోలు చేసిన ఆస్తి అని, కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి నిర్ణీత సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అందించాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. అప్పగించిన ధాన్యాన్ని లెక్కల్లో చూపకుండా ఉంచడం, ఇతర అవసరాలకు మళ్లించడం లేదా సీఎంఆర్‌ను అందించకుండా బకాయి పెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
కొన్ని మిల్లుల వద్ద గత సీజన్లకు సంబంధించిన ప్రభుత్వ ధాన్యం కూడా భౌతికంగా అందుబాటులో లేనట్లు గుర్తించిన నేపథ్యంలో, సంబంధిత రికార్డులు, ధాన్యం అప్పగింత వివరాలు, సీఎంఆర్ డెలివరీ, రవాణా వివరాలు, భౌతిక తనిఖీ నివేదికలను సమగ్రంగా పరిశీలించి బాధ్యులను గుర్తిస్తామని తెలిపారు.
ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ బకాయిలపై తనిఖీలు, పంచనామాలు, రికార్డుల పరిశీలన నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్‌ను సకాలంలో అందించడంతో పాటు బకాయిలను పూర్తిగా వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు, బకాయిల వసూలు, రెవెన్యూ రికవరీతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు.






