15 August, 2026 | 2:41 AM

నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును కాపాడాలి: సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి

15-08-2026 01:25 AM

గంభీరావుపేట, ఆగస్టు 14 (విజయక్రాంతి): నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును కాపాడాలని సిపిఐ జాతీయనేత మాజి ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించి మీడియాతో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలకు జీవనాడిగా ఉన్న నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1946 నుంచి 1951 మధ్య నిర్మాణం పూర్తున ఈ ప్రాజెక్టు గత 7075 ఏళ్లలో సరైన సంరక్షణ లేక దెబ్బతిందని తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత చేపట్టామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, నర్మాల ప్రాజెక్టులో ఇప్పటికీ భారీగా పూడిక పేరుకుపోయిందని విమర్శించారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా పరిస్థితిలో మార్పు లేదని అన్నారు.

స్థానిక ప్రజలు, జేఏసీ, ‘నర్మాల బచావో’ ఉద్యమకారులు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు.2.2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, పూడిక కారణంగా ప్రస్తుతం కేవలం 1.2 టీఎంసీలకే పరిమితమైందని తెలిపారు. మెట్ట ప్రాంతాలైన ముస్తాబాద్, గంభీరావుపేట మండల రైతులకు ఈ ప్రాజెక్టు వరప్రసాదమని చెప్పారు.ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేపట్టాలని కోరారు.

ప్రాజెక్టులో గేట్లు లేకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం మరింత తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో సుమారు 22 నుంచి 23 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఈ ప్రాజెక్టు, తాగునీరు మరియు సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.నర్మాల ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించి సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేస్తామని, అవసరమైతే ప్రతినిధి బృందంతో కలిసి నేరుగా ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు.అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, కొండపోచమ్మ ప్రాజెక్టులతో అనుసంధానం ద్వారా నర్మాల ప్రాజెక్టుకు శాశ్వత నీటి సరఫరా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గోదావరి జలాలను అనుసంధానం చేయడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు.నర్మాల ప్రాజెక్టును కాపాడేందుకు సీపీఐ కంకణం కట్టుకుందని, చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్, నాయకులు చాకలి రమేష్, మంగలి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.