15 August, 2026 | 3:40 AM

వేగం పెంచాలి

15-08-2026 02:23 AM
  1. పుష్కరాల పనులు సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభించాలి
  2. నెలాఖరుకు టెండర్లు పూర్తి చేయండి
  3. శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి
  4. అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం 
  5. గోదావరి పుష్కరాలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ‘గోదావరి పుష్కరాలు 2027’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వ హించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవు తోందని, సెప్టెంబర్ మొదటి వారంలోనే పనులను ప్రారంభించాలని, అందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను ఈనె లాఖరు లోగా పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో  పుష్కరాల ఏర్పాట్లు, శాఖల సన్నద్ధతపై సమీక్షించారు. ఈ కార్య క్రమంలో  మంత్రులు కొండా సురేఖ, తుమ్మల, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కమిటీ సభ్యులు శాఖల వారీగా సన్నద్ధ త, ఏర్పాట్ల పురోగతిని ప్రత్యేకంగా సమీ క్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..  గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్- ప్రాంతాలకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నాణ్యతలో రాజీ పడొద్దని, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలిస్తుండాలని పేర్కొన్నారు. పనుల పురోగతిని రోజువారీగా తెలుసుకునేలా ప్రత్యేక డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తేవాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమష్ఠిగా పని చేస్తేనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుష్కరాలు విజయవంతం అవుతాయని, సమన్వయం లోపం తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. 

ప్రతి రోడ్డునూ అనుసంధానించాలి

పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి రోడ్డును అనుసంధానించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఎక్కడైనా రోడ్ల కనెక్టివిటీ లేకపోతే వెంటనే గుర్తించి, లోక్ ఫండ్ ద్వారా పనులు చేపట్టాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, పండితులను పుష్కర ఏర్పాట్లలో భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించాలనిసూచించారు.