ఇన్వెస్ట్ తెలంగాణ
- గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం
- డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో..
- డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లోని అవకాశాలను చాటి చెప్పాలి
- స్టార్టప్, పరిశ్రమలు సాధించిన విజయాలు, కొత్త ఆవిష్కరణలపై ప్రదర్శనలు
- సదస్సు నిర్వహణకు డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం సచివాలయంలో దాదాపు 3 గంటల పాటు జరిగిన క్యాబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. గత ఏడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించినట్లే.. ఈసారి కూడా ప్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్‌తో సదస్సు నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించాలని ప్రాధమికంగా తేదీలను నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి అధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఆవిష్కరించనుంది.
ప్రధానంగా రాష్ట్రంలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మా రంగాల్లో పరి శ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈసారి సదస్సు జరుగుతుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే తెలంగాణ స్టార్టప్‌లు, పరిశ్రమలు సాధించిన విజయాలు.. వివిధ రంగాల కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఎగ్జిబిషన్, స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీ రఘురామిరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివవరించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రేష న్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించిందని, అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతంలో రాష్ట్రంలో 2.81 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో 62 లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూర్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఈ రోజుకు మొత్తం 3.42 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులున్నారు. వీరికి స్మార్ట్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఏడు రకాల సన్నాలకే రూ. 500 బోనస్..
వానాకాలం పంటకు సంబంధించి ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించి, ఆ ఏడు రకాల సాగును పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్ చెల్లించాలని కేబినేట్ తీర్మానించింది. ప్రభుత్వం లేదా ప్రయివేట్ వ్యక్తుల ద్వారా ఏడు రకాల సన్నవరి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు వ్యవసాయ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా రైతుల్లో అవగాన, చైతన్యం కల్పించే విధంగా అధికారులు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ వేలం ద్వారా 17.54 ఎల్‌ఎంటీల ధాన్యం విక్రయం..
యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబట్టుకున్న నేపథ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.2389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి.. ఈ వేలం ద్వారా ధాన్యం అమ్మాలని కేబినేట్ నిర్ణయించింది.
ఆ కళాశాలలు యంగ్ ఇండియాలోకి..
రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు సాంకేతిక విద్యా శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిని తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి తొలగించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ) పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేసేందుకు క్యాబినెట్ తీర్మానించింది.
ఏడు నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు..
ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలివిడతగా 113 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్ కాంప్లెక్స్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు కొత్తగా ఆమోదించిన 7 స్కూళ్లతో కలిపి ఇప్పటివరకు 86 యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ లకు అనుమతులు మంజూరయ్యాయి.
మిగిలిన నియోజకవర్గాల్లోనూ వీలైనంత తొందరగా స్థల సేకరణ చేసి, నిర్మాణాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్ 2 పనులకు రూ. 2,100 కోట్లు..
మక్తల్- ఎత్తిపోతల ఫేజ్- పనుల కోసం రూ. 2,100 కోట్ల అంచనా వ్యయానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఈ ఎత్తిపోతల నుంచి అందుతుంది. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచటంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈవీలుగా ఆటోలు..
రూ. 200 కోట్లతో ప్రత్యేక పథకం..
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి.. హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్రమంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసు కుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వీటిని ఈవీ (విద్యుత్తు వాహనాలుగా) మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్) అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలి పింది. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షలు సబ్సిడీ అందిస్తారు. ఈ పథకం కింద, ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకోవచ్చు.
హిల్ట్‌పాలసీకి గడువు పెంపు..
హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు కేబినెట్ నిర్ణయించింది. అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.






