బీటీకి.. బాటేసేది ఎప్పుడో?
- గుంతల తారు రోడ్లతో నిత్యం ఇబ్బందులే
- టెండర్లు పిలిచిన ముందుకురాని కాంట్రాక్టర్లు
- మంత్రి ప్రారంభించిన పనులకు మోక్షం లేదాయే?
ఉట్నూర్, మార్చి 16 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బీ.టీ రహదారులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసిన, నేటికీ పనులకు మోక్షం కలగడం లేదు.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు మూడుసార్లు టెండర్లు వేసిన నేటికీ కాంట్రాక్టర్ లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదని ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మారుమూల గిరిజన గ్రామాలకు ఉన్న బీ.టీ రోడ్డులు గుంతల మయంతో పూర్తిగా ధ్వంసం అయ్యాయని, దీంతో గిరిజనుల రాకపోకలతో పాటు అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సైతం రావడంలేదని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తగిన చర్యలు తీసుకొని వేసవికాలంలో తారు రోడ్డులకు మరమ్మత్తులు చేసి వర్షాకాలంలో ఇబ్బం దులు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్, అదిలాబాద్ రూరల్ మండలం, సిరికొండ, ఇచ్చోడ తదితర మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఉట్నూర్ మండలంలోని షాంపూర్ నుండి లక్షేట్టిపేట్ తో పాటు కామాయి పేట్ వరకు బీటీ రోడ్ మరమ్మత్తులకు రూ. 2.97 కోట్లు మంజూరయ్యాయి. మంజూరైన నిధులకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారు లు మూడుసార్లు టెండర్లు పిలిచిన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌లు ముందుకు రావడం లేదు. టెండర్లలో పనులు తీసుకొని పనులు పూర్తిచేసి బిల్లుల కోసం తిరగావలసి వస్తుందని, బిల్లులు చేతికి వచ్చే వరకు ఇంటి నుండి వడ్డీ చెల్లించవలసి వస్తుందని కాంట్రాక్టులు వాపోతున్నారు.
ఈ రోడ్డుతో పాటు ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడ గ్రామ పం చాయతీ కేంద్రం నుంచి దుబ్బ గూడ వరకు తారు రోడ్డు నిర్మాణానికి రూ. 1.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ రోడ్డు పనులను స్వ యంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పనులు ప్రారంభించి ఏడాది పూర్తి అయిన నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ఏజెన్సీలో ఇలాంటి రోడ్లు చాలా వరకు ఉన్న వాటి మరమ్మత్తులపై అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదని గిరిజనులు ఆవేదనతో తెలుపుతున్నారు.
రహదారుల పనులు పూర్తి చేయాలి..
షాంపూర్ నుంచి కామాయి పేట్ వరకు ఉన్న తారు రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా మారింది. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై రెండేళ్లు అవుతున్న నేటికీ పనులు ప్రారంభం కావడం లేదు. ఈ రోడ్డు తో పాటు ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లోని తారు రోడ్లు పూర్తిగా గుంతల మయం అయ్యాయి.. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని, వర్షాకాలం లోపు రోడ్ల పనులు పూర్తి చేయాలి. వర్షాకాలంలోగా పనులు పూర్తి కాకుంటే గిరిజనులు బయట ప్రపంచానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది.
సలాం శ్యామ్ రావు, సార్‌మేడి, క్షెట్టి పేట్
నాలుగోసారి టెండర్లు పిలుస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డులో మరమ్మత్తు నిధులతో నాలుగో సారి టెండర్లు పిలుచుటకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఉట్నూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలకు మంజూరైన నిధులతో మూడుసార్లు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్‌లు ముందుకు రావడం లేదు. మరోసారి టెండర్లు పిలుచుటకు ఏర్పా ట్లు చేస్తున్నాం.
రమేష్ పవార్, డిప్యూటీ ఈ.ఈ పంచాయతీరాజ్ శాఖ




