దోపిడీకి అడ్డుకట్ట ఎప్పుడు.?
- ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు..
- బడుల్లోనే యూనిఫామ్స్, పుస్తకాల విక్రయాలు
- ప్రభుత్వ నిబంధనలకు తూట్లు
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
వనపర్తి, జూన్ 22 (విజయక్రాంతి): తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంత ఖర్చు అయినా భరించేందుకు సిద్ధంగా ఉండటాన్ని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అవకాశంగా మలుచుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీజుల పెంపు, పుస్తకాలు, యూనిఫామ్స్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐ ఐ టి, టెక్నో, ఈ-బ్యాచ్ వంటి పేర్లతో ఆకర్షణీయ ప్రచారాలు చేస్తూ విద్యార్థులను చేర్చుకుంటున్న కొన్ని పాఠశాలలు ఫీజులను 20 నుంచి 30 శాతం వరకు పెంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పాఠశాలకు అనుబంధంగా ఉన్న దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఫీజుల పేరుతో భారమే..
జూన్లో పాఠశాలలు ప్రారంభమైనా మే నుంచే అడ్మిషన్లు ప్రారంభించి వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అడ్మిషన్ ఫీజు రూ.500 నుంచి రూ.1000 వరకు తీసుకుంటుండగా, తరగతులను బట్టి రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. యూనిఫామ్, షూ, టై, బెల్ట్లకు రూ. వెయ్యి నుంచి రూ.2 వేల వరకు, బస్సు ఫీజు పేరుతో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
పర్యవేక్షణ ఏదీ..?
ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. ఫీజుల నియంత్రణ, పేరెంట్స్ కమిటీలు, గవర్నింగ్ బాడీల ఏర్పాటు వంటి నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
జీవో నిబంధనలు బేఖాతర్ ..
ప్రైవేట్ విద్యాసంస్థల నియంత్రణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఆదాయ వ్యయాల ఆడిట్, వార్షిక నివేదికలు సమర్పించడం వంటి అంశాలను పలు పాఠశాలలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సిన నిబంధనలు కూడా అమలు కావడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఈ వ్యవహారాలపై విద్యాశాఖ అధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలని విద్యావంతులు పెదవి విరుస్తున్నారు






