సాగుకు సమాయత్తం
రైతు వేదికల్లో విత్తన మేళా
మహబూబాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): వానాకాలంలో పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. ఎలినో కారణంగా ఈసారి వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే సమాచారం మేరకు తక్కువ పంట కాలం విత్తనాలను నాటే దిశగా వ్యవసాయ శాఖ ఈసారి రైతులను సమాయత్తం చేయడానికి నడుం బిగించింది.
దీనికి తోడు వరి పంట సాగులో రైతులు ప్రభుత్వం గుర్తించిన వరి రకాలను మాత్రమే సాగు చేసే విధంగా అవగాహన పెంపొందించడానికి చర్యలు చేపట్టారు. అలాగే పంటల మార్పిడి, మూస పద్ధతిలో పంటల సాగు కాకుండా వాణిజ్య పంటల సాగు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నిర్వహణ తదితర అంశాలపై రైతుల్లో అవగాహన పెంపొందించడానికి రైతు మేళ నిర్వహిస్తున్నారు. ఇందులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు, మేలైన విత్తనాలు ప్రదర్శించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా రైతులకు అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన 59 రైతు వేదికల్లో ఈ నెల 23 నుండి 30 వరకు వారం రోజుల పాటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనమేళా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుత వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందువలన రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ జిల్లాలో గల 59 రైతు వేదికలలో వివిధ రకాలైన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.
ఈ విత్తన మేళలో వరిలో సన్న రకాలైన బిపిటి 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, డబ్ల్యూ జి ఎల్ 44, కేఎన్‌ఎం 1638, కె ఎం ఎం 7715, హెచ్‌ఎంటి సోన, జైశ్రీరామ్ వంటి ప్రభుత్వం సూచించిన సన్న రకం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు, పెసర, కంది, మినుము, జనుము వంటి విత్తనాలు, వివిధ రకాలైన కూరగాయల విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. గుళిక రూపంలో ఉండే యూరియాకు ప్రత్యామ్నాయమైన నానో యూరియా, నానో డీఏపీలు కూడా అందుబాటులో ఉంటాయని, రైతు సోదరులందరూ తమకు అందుబాటులో ఉన్న రైతు వేదిక సందర్శించి విత్తనాలను కొనుగోలు చేసే విధంగా మేళాలో ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రైతులు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తున్న విత్తన మేళా కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలి. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే విధంగా కృషి చేయాలి. నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి.
పంట మార్పిడి విధానం పాటించాలి. కేంద్రీయ పద్ధతుల అమలకు ప్రత్యేక కార్యచరణ చేయాలి. విత్తన మేళా ఎంతో ఉపయోగకరం. అందుబాటులో ఉన్న రైతు వేదికలో నిర్వహించే విత్తన మేళా కార్యక్రమంలో ప్రతి రైతు హాజరు కావాలి.
సర్వ విజయచంద్ర, డీఏవో, మహబూబాబాద్






