మొనగాడు కాదు.. మోసగాడు!
- రైతు భరోసా ఎగ్గొట్టి, బోనస్‌ను బోగస్ చేసిన కాంగ్రెస్
- కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం కొనలేని దద్దమ్మలు బీఆర్‌ఎస్‌ను మొలకెత్తనివ్వబోమనడం విడ్డూరం
- రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14 సీట్లు మావే
- కొడంగల్‌లో రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తాం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
నాగర్‌కర్నూల్/అచ్చంపేట, జూన్ 22 (విజయక్రాంతి): దేవుళ్లపై ఒట్టేసి మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి మోసగాడే అవుతాడుగానీ మొనగాడు ఎలా అవుతాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సోమవారం నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహిం చిన బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి, నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూ ఈ ప్రాంత గౌరవం తగ్గిస్తున్నాడని ఆరోపించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలోని రైతులకు రూ.29,350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీపడ్డాడని అన్నా రు. కాంగ్రెస్ పాలనలో బోనస్ కాస్తా బోగస్ అయిందన్నారు. వర్షంలో తడిసి మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ను రాష్టంలో మళ్లీ మొలకెత్తనియ్యనని అనడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు అసెంబ్లీ స్థానాలు 14 మేమే గెలుస్తామని, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని కూడా చిత్తుగా ఓడిస్తామ ని శపథం చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఉండదని చెబుతున్న రేవంత్ రెడ్డి మాటలు నిజమవుతాయని.. తామే పాలకపక్షంలో ఉంటామని ధీమా వ్య క్తం చేశారు. దానికోసం 100 స్థానాల్లో పార్టీ ని గెలిపించి అధికారంలోకి తీసుకెళ్లేలా కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలు పునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు, సోయాబీన్, పల్లి, సన్ ప్లవర్ కొంతమేరే కొంటామని చెపుతోందని, కేం ద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంటుందని వివరించారు.
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదేమోనని ఆరోపించారు. ధాన్యం సేకరణలో తరుగు తీస్తే తోలు తీస్తానని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం ఇప్పుడు దళారుల, మిల్లర్ల చేతిలో తోలుబొమ్మగా మారాడని ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తమ పదవులకు అనేకమార్లు రాజీనామా చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని.. రేవంత్ మా త్రం జిరాక్స్ కాపీని ఇచ్చి వెళ్లిపోయాడని ఆరోపించారు.
అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించామని చెపుతున్నా వాటిలో ఒక పైసా కూడా ఖర్చు చేయకుండా మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ‘సీఎం తన కోసం జూబ్లీ హిల్స్‌లో ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో రూ.100 కోట్లతో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. దాని చుట్టూ ఇనుప కంచె కోసం రూ.17 కోట్ల ఖర్చు చేశాడు. మనవడితో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు పైసలు ఉంటాయి.
కేరళ, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో వందల కోట్లు ఖర్చు పెట్టీ యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి. కానీ రైతు భరోసాకు, పేద వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు మాత్రం డబ్బులు లేవంట అని విమర్శించారు. కొంతమంది ప్రభుత్వాధికారులు తప్పుడు కేసులతో బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక వారందరిపై ఛార్జ్‌షీట్ ఉంటుందని అవసరమైతే పరువు నష్టం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రిటైర్డ్ అయినా, బొక్కలో వేస్తామన్నారు.
ప్రాజెక్టులపై ప్రభుత్వానికి వివక్ష
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక ప్రాజెక్టును పూర్తి చేయలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఇటీవల పాలమూరు జిల్లాలో ప్రాజెక్టును పరిశీలించిన సీఎం వాటిని అర్ధం చేసుకునేందుకే రెండున్నరేళ్లు పట్టిందని చెప్పారని మరి వాటిని పూర్తి చేసేందుకు ఇంకెంతకాలం పడుతుందని ఈ ప్రభుత్వంలో కృష్ణా నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయని ఆరోపించారు.
మన్నెవారి పల్లిలోని ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం మూరెడు కూడా తవ్వలేదని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






