23 June, 2026 | 2:46 AM

ఖానాపూర్ ఆధార్ కేంద్రం... అనేక అవస్థలు

23-06-2026 01:27 AM

తెల్లవారు 3:00 గం. నుంచి క్యూ లైన్

నమోదు కోసం రోజుల తరబడి పడి గాలింపులు

ఖానాపూర్ జూన్ 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఆధార్ నమోదు చేసుకోవాలంటే వినియోగదారులకు నానా అవస్థలు తప్పడం లేదు. దీనికి కారణం నమోదు కేంద్రం ఒక్కటే ఉండడం వల్ల వినియోగదారులకు సేవలు అందక ప్రజలకు ఆర్థిక భారం పడుతుంది.

మండల కేంద్రంలోని తహసిల్ కార్యాలయంలో ఉన్న ఆధార్ కేంద్రంలో నూతన ఆధార్, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, ఆధార్ రెన్యూవల్, ఫింగర్ ప్రింట్స్, తదితర సేవలు ప్రజలకు అందాల్సి ఉంది .కాగా మండలం మొత్తానికి ఓకే కేంద్రం ఉండడం వల్ల సేవలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ప్రతిరోజు 30 మందికి మాత్రమే సేవలు అందిస్తామని వారికి టోకెన్ సిస్టం పెట్టడంతో టోకెన్ నెంబర్ కోసం వినియోగదారులు ఆయా గ్రామాల నుంచి తెల్లవారుజాము మూడు గంటలకే వచ్చి ఆధార్ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఈ విధంగా ఇల్లు వాకిలి విడిచి కేంద్రం వద్ద నిరీక్షించడం వల్ల 30 మంది లోపు వారికి సేవలు అందుతున్నాయి. అదనంగా వచ్చినవారు మళ్లీ రావాలనడంతో వారికి తీవ్ర ఆర్థిక బారం పడుతుంది. మండలంలోని సుదూర గ్రామాల నుంచి అనేక అవసరాలకు ఈ కేంద్రానికి వచ్చిన వారికి చుక్కెదురవుతుంది.

ఈ నేపథ్యంలో మండలంలోని సోమవార్ పేట్ గ్రామం నుంచి వచ్చిన ఒక రైతు కుటుంబం ఇప్పటికీ నాలుగు రోజులుగా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వెలుబుచ్చారు. కాగా గతంలో ఈ సేవలు బిఎస్‌ఎన్‌ఎల్, గ్రామీణ బ్యాంకు లలో కూడా లభించగా ప్రస్తుతం ఆ కేంద్రాలపై అనేక కారణాల తో అక్కడ సేవలు నిలిపివేశారు. దీంతో ఉన్న ఒక కేంద్రంపై భారం పడడంతో నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజల అవసరార్థం సౌకర్యాలు పెంచాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.