బ్రిడ్జిల నిర్మాణాలకు మోక్షం ఎప్పుడు?
- వర్షాకాలంలో ప్రజలకు తప్పని అగచాట్లు..
- నీట మునిగే రహదారులతో పల్లె ప్రజల నరకయాతన!
అలంపూర్ మే 31: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా గ్రామీణ ప్రాంతాల ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. వర్షాకాలం వస్తే చాలు, ప్రధాన రహదారులపై ప్రవహించే వరద నీటితో గ్రామాల రాకపోకలు పూర్తిగా స్థంభిస్తున్నాయి.ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
అలంపూర్ నియోజకవర్గంలో ఇటీవలే పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు ప్రధాన రహదారిపై ఉన్న లోతట్టు వంతెనపై భారీగా నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు నడుము లోతు నీటిలో నడుచుకుంటూ నిత్యావసర పనులకు వెళ్లాల్సి వస్తోంది. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిండు వర్షాకాలం లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలో పడ్డారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలపై ముప్పు
అలంపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా కర్నూలు ,ఐజ, రాయచూరు అంతరాష్ట్ర రహదారి ఐజ సమీపంలో ఉన్న వక్కెర వాగుపై నీటి ఉధృతి వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అదేవిధంగా.మెన్నిపాడు గ్రామ సమీపంలో ఉన్న వాగుపై బ్రిడ్జి ఎత్తు లేకపోవడంతో నీటి ఉధృతి ప్రవాహం పెరిగి గ్రామస్తులు ఊరికే పరిమితమై బయటకు వెళ్లలేనలేని పరిస్థితి నెలకొంది. అమరవాయి,
మానవపాడు గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు పొంగి పొర్లి ఇరు గ్రామాల ప్రజల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడి గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే లేదా అత్యవసర వైద్య సేవలు అవసరమైతే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. అంబులెన్స్లు గ్రామానికి చేరుకోలేకపోవడంతో రోగులను భుజాలపై మోసుకుంటూ లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్నిసార్లు ఆలస్యం కారణంగా ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంతెనల ఎత్తు పెంపుపై ప్రజల డిమాండ్
ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.లోతట్టు వంతెనల స్థానంలో ఎత్తున బ్రిడ్జిలు నిర్మిస్తే గ్రామాలకు ఏడాది పొడవునా అంతరాయం లేకుండా రాకపోకలు సాగుతాయని వారు చెబుతున్నారు.
మాటల్లోనే గ్రామాభివృద్ధి?
‘దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు‘ అని నాయకులు చెప్పడం తప్ప, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి తగిన చర్యలు కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, వర్షం వస్తే గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతుండటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అంటున్నారు. ప్రతి ఏటా ఇదే కష్టాలు పడుతున్న గ్రామీణ ప్రజలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? బ్రిడ్జిల నిర్మాణానికి మోక్షం ఎప్పుడు లభిస్తుంది? అనే ప్రశ్న ఇప్పుడు ఆయా గ్రామాల్లో ప్రజల మధ్య చర్చకు దారితీసింది . పాలకులు,అధికారులు స్పందించి ఎత్తున వంతెనల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బ్రిడ్జి ఎత్తు పెంచి శాశ్వత పరిష్కారం చూపాలి
ప్రతి సంవత్సరం వర్షాలు పడినప్పుడల్లా ఈ వాగు పొంగిపొర్లి బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా బ్రిడ్జి ఎత్తు పెంచి, శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలి
- దేవసేనా రెడ్డి .రిటైర్డ్ లెక్చరర్ మానవపాడు






