1 June, 2026 | 1:21 AM

రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు

01-06-2026 12:00 AM
  1. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సరిగ్గా ఉండాల్సిందే..!
  2. రైతులకు ఇబ్బంది కలిగితే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్!
  3. రికార్డుల నిర్వహణపై అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆగ్రహం

రంగారెడ్డి, మే 31 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్థంగా ఉండడంపై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని నోముల డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుల వారీ రిజిస్టర్లు, తేమ శాతం రికార్డులు సక్రమంగా లేకపోవడాన్ని గమనించి, పీపీసీ ఇన్ఛార్జిని తీవ్రంగా హెచ్చరించారు. రికార్డులన్నింటినీ వెంటనే నవీకరించాలని (అప్డేట్) ఆదేశించారు.

జాప్యం చేస్తే బ్లాక్ లిస్ట్‌లోకే.. 

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవం తం చేయాలని, రవాణాలో ఎలాంటి జా ప్యం జరగకుండా తగినన్ని వాహనాలను అందుబాటులో ఉంచాలని రవాణా కాంట్రాక్టర్ను ఆదేశించారు. వాహనాల కొరత వల్ల రైతులకు ఇబ్బంది కలిగితే కాంట్రాక్టర్లపై కఠి న చర్యలు తీసుకోవడమే కాకుండా బ్లాక్లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో ధాన్యం తడవకుండా మార్కెట్ కమిటీల నుంచి తగినన్ని టార్పాలి న్లు సమకూర్చుకోవాలని సూచించారు. కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియల్లో నిర్లక్ష్యాన్ని సహించమని స్పష్టం చేశారు.

17% తేమ ఉంటేనే కొనుగోలు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధర (ఎమ్ ఎస్ పీ ) లభించాలంటే ధాన్యంలో తేమ శాతం 17% లోపు ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి, నాణ్యతా ప్రమాణాల ప్రకారం కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. నిబంధనల ప్రకారం రికార్డు లు నమోదు చేయకపోతే నిర్వాహకులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మిల్లర్ల తరుగుపై నిఘా..

కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయడంలో ఆలస్యమైతే, బరువు తగ్గుతుందనే నెపంతో రైస్ మిల్లర్లు తరుగు (కటింగ్) పేరిట రైతులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, దీనిపై సివిల్ సప్లైస్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. తూకంలో మోసాలు జరిగితే రైతులు స్థానిక అధికారులకు ఫిర్యా దు చేయవచ్చని తెలిపారు.ఈ తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత, డీ ఎం సివిల్ సప్లైయ్ హరీష్, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్ రెడ్డి, నోముల తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.