28 March, 2026 | 3:47 AM

విస్తరణ ఎప్పుడు?

28-03-2026 02:11 AM

ప్రస్తుతం క్యాబినెట్‌లో సీఎంతో పాటు 16 మంది మంత్రులు

ఖాళీగా ఉన్న రెండు బెర్తులు

  1. క్యాబినెట్‌లో కనిపించని సామాజిక సమతుల్యత
  2. 50% పైగా ఉన్న బీసీల్లో ముగ్గురికే చాన్స్ ఎస్టీల్లో లంబాడ సామాజిక వర్గానికి దక్కని చోటు
  3. అశావహుల ఎదురుచూపులు

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రెండున్నరేళ్లు పూర్తికావస్తోంది. అయి నా పూర్తిస్థాయిలో క్యాబినెట్ భర్తీ కాకపోవడంపై సొంత పార్టీలోనే పెద్దఎత్తున విమర్శలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 15 శాతానికి మించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. అంటే  ముఖ్యమంత్రితో కలిసి మొత్తం క్యాబినెట్ సభ్యుల సంఖ్య 18 వరకు ఉండాలి.

అయితే తెలంగాణ క్యాబినెట్‌లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు 16 మంది మంత్రులు ఉన్నా రు. ఇంకా మంత్రివర్గంలో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న ఆ రెండు బెర్తుల భర్తీకి.. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనేది చర్చగా మారింది.  ఈ రెండు బెర్తుల కోసం ఐదారుగురు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. వీటితో పాటు క్యాబినెట్ హోదా కలిగిన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, చీప్ విప్ పదవులను భర్తీచేయకుండా మొదటినుంచి నాన్చుతూనే ఉన్నారు. 

ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద కొందరు ప్రస్తావించగా, ‘ఇప్పుడు  ప్రభు త్వం నడుస్తుందిగా.. ఇప్పుడేమి ఆగడం లేదు. ప్రభుత్వ పనులన్నీ సజావుగానే సాగుతున్నాయి.  కేసీఆర్ హయాంలో ఆరునెలలు మంత్రులే లేకుండా పాలన చేశారు. అయినా మంత్రివర్గ విస్తరణ, పదవుల పంపకం అనేది అధిష్ఠానం నిర్ణయం మేరకు ఉం టుంది’ అని సమాధానమిచ్చినట్లుగా సమాచారం.

దీంతో ఆమా త్య పదవుల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లుంది. క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా? లేక మరో రెండేళ్ల పాటు ఉన్న మంత్రులతోనే పాలన సాగిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మంత్రి పదవుల కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇబ్రాహీపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తదితరులు  ఎవరికి వారుగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారని తెలిసింది.  

మూడు విడతులుగా విస్తరణ.. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంట నే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులుగా భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, కొండా సురేఖ, సీతక్క, పొ న్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు రెండోసారి విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్, వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటిచ్చారు. ఇక మూడోసారి జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు మైనార్టీ సామా జికవర్గానికి చెందిన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం ఇంకా రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.

సామాజిక న్యాయం పాటించాలి.. 

రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను కనుక భర్తీ చేస్తే.. సామాజిక న్యాయం పాటిం చాలనే డిమాండ్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఓసీలకు వారి కోటా కంటే ఎక్కువగానే దక్కిందని, ఇక మిగిలిన రెండు ఆమాత్య పదవులను బీసీలకు ఇవ్వాలని ఆ వర్గాలు ఒత్తిడి చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం పార్లమెంట్‌లో తేల్చుకోవాల్సి ఉంటుందని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వాటిని అమలు చేసి చూపించాలని కోరుతున్నారు.

మున్నూరుకాపు, గొల్ల, కుర్మలతో పాటు రజ క, ఇతర ఎంబీసీ వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వా మ్యం చేయాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల వ రకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వ స్తుండటంతో.. మంత్రివర్గంలోని మహిళలకు ఆ మేరకు చోటివ్వాలని రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది.  రాష్ట్ర క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న రెండు బెర్తులకు.. బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి మహిళలకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని పరిశీలకుంటున్నారు.

బీసీల పాట, ఓసీల కోటా..  

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు బీసీల పాట.. ఓసీల కోటాగా మారింది. సా మాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీనే  బ్రాం డ్ అంబాసిడర్ అని ఆ పార్టీ నాయకులు చెప్పుకోవడమే తప్ప.. పదవుల పంపకానికి వచ్చేసరికి సామాజిక సూత్రాన్ని తూట్లు పొడుస్తున్నారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నిత్యం బీసీల పాట పాడుతున్న కాంగ్రెస్.. పదవుల విషయం వచ్చేసరికి మొండి చెయ్యి చూపిస్తుందని మండిపడుతున్నారు.  ఓట్ల సమయంలో కా ంగ్రెస్ అంటేనే బడుగు, బలహీనవర్గాల పార్టీ అని ప్రచారం చేసుకోవడం..

గద్దెనెక్కా క ఒకటి, రెండు అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తు న్న పరిస్థితి కనిపిస్తోంది. అది మంత్రి పదవుల నుంచి మొదలుకుంటే.. నామినేటెడ్, పార్టీ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయమే జరుగుతున్నది. 

పదహారులో ఏడుగురు ఓసీలే..

క్యాబినెట్‌లో సీఎంతో కలిపి మొత్తం 16 మంది మంత్రులు ఉండగా, అందులో ఓసీ సామాజికవర్గానికి చెందినవారే ఏడుగురు ఉన్నారు. వీరిలో రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు (కమ్మ), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (బ్రాహ్మణ), జూపల్లి కృష్ణారావు (వెలమ) మంత్రులుగా ఉన్నారు.

ఇక ఎస్సీ సామాజికవర్గం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వివేక్ వెంకట్‌స్వామి (మాల), దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (మాదిగ) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎస్టీ సామాజికవర్గం నుంచి సీతక్క (ఆదివాసి), మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇక జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ సామాజికవర్గం నుంచి కేవలం ముగ్గురు మంత్రులే ఉండటం గమనార్హం. 

వీరిలో పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గంలో వాస్తవానికి బీసీ సామాజికవర్గం నుంచి కనీసం ఏడుగురు మంత్రులు ఉండాల్సింది. కానీ, రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో బీసీలు ముగ్గురు మంత్రులే ఉన్నారు. అంటే 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు మంత్రివర్గంలో మాత్రం 16 శాతం వాటానే  దక్కింది. ఎస్టీల్లోని లంబాడ సామాజిక వర్గానికి చోటు కల్పించాల్సిన అవసరం ఉంది.