28 March, 2026 | 3:31 AM

ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

28-03-2026 01:41 AM
  1. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 10, డీజిల్‌పై పూర్తిగా తొలగింపు
  2. వాణిజ్య గ్యాస్ సరఫరా పెంపు

న్యూఢిల్లీ, మార్చి 27: పెట్రోల్, డిజీల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందు కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 13 నుంచి రూ. 3కు తగ్గించగా, డీజిల్‌పై రూ. 10 సుంకాన్ని పూర్తిగా తొలగించింది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చమురు మార్కెటింగ్ సంస్థలకు ఊరట లభించినట్లయ్యింది.

ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి దాదాపు మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తి, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ భగ్గుమం టున్న విషయం తెలిసిందే. ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటింది. అయినా దేశీయంగా పెట్రోల్, డీజిల్‌పై ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు లీటర్ పెట్రోల్/డీజిల్ పై దాదాపు రూ. 48 వరకు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యం లో అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు నయారా ఎనర్జీ ఇంధన ధరలను పెంచింది.

మిగతా చమురు సంస్థలు కూడా ఆ బాటపట్టే అవకాశం ఉండటంతో కేంద్రం ఎక్సైజ్ సుంకాలపై ఇంధన సంస్థలకు ఊరట కల్పించింది. ఈ నిర్ణయంతో రిటైల్ మార్కెట్‌లో పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గే అవకాశం లేదు. ఇంధన ధరల భారాన్ని సంస్థలు ప్రజలపైకి బదిలీ చేయకుండా ఈ చర్య కొంతమేర ఉపకరిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

మరో ౨౦ శాతం వాణిజ్య గ్యాస్ సరఫరా పెంపు

వాణిజ్య గ్యాస్ సరఫరాకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సరఫరాను మరో 20 శాతం పెంచింది. గతవారం పెంచిన 50 శాతంతో పోలిస్తే 70 శాతం పెంచినట్లయ్యింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్లు కేంద్రం తెలిపింది. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 40 శాతం పెరిగిందని, మార్చి 14 నుంచి మార్చి 26 వరకు వాణిజ్య వినియోగదారులకు 30వేల టన్నుల ఎల్పీజీని సరఫరా చేశామని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రపంచం ఇంకా యుద్ధం లాంటి పరిస్థితిలోనే ఉందని, దీంతో దేశ చమురు, ఎల్పీజీ సరఫరా ప్రభావితమైందని, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలతోపాటు ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో తగినంత ముడిచమురు నిల్వలున్నాయని, రాబోయే రెండు నెలల వరకు ఎలాంటి ఢోకా లేదని కేంద్రం స్పష్టం చేసింది.