28 March, 2026 | 2:29 AM

మినీ స్టేడియానికి మోక్షమెప్పుడో?

28-03-2026 12:28 AM
  1. 30 సంవత్సరాలు అయినా పూర్తిగాని నిర్మాణం..

ఎమ్మెల్యేల హామీలకే పరిమితం అవుతున్న స్టేడియం..

క్రీడలకు పుట్టినిల్లుగా తాడువాయి..

తాడ్వాయి,మార్చి, 27( విజయ క్రాంతి ): గ్రామీణ క్రీడాకారులే జాతీయ క్రీడాకారులుగా ఎదుగుతారనే సంకల్పంతో గత 30 సంవత్సరాల క్రితమే తాడ్వాయి లో మినీ స్టేడియం నిర్మాణానికి రూపకల్పన చేశారు. గుట్టమీద విశాలమైన ప్రాంతంలో స్టేడియం ఉండాలనే లక్ష్యంతో స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో క్రీడాకారులకు ప్రశాంతమైన వాతావరణం, మానసిక ఉల్లాసం ఉంటుందని భావించారు.

అందుకోసమే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరీ మాత ఆశ్రమం ఎదురుగా ఉన్న విశాలమైన గుట్టపై మినీ స్టేడియం నిర్మాణం కోసం ఏర్పాట్లు చేశారు. స్టేడియం నిర్మాణం పూర్తి అవుతే గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభగల క్రీడాకారులు మరింత రాణించి రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందుతారని భావించారు. అందుకోసం అప్పటి నాయకులు ప్రత్యేకంగా తాడువాయి మండల కేంద్రంలో క్రీడా మైదానం కోసం నిధులు సమకూర్చుకొని భూమి కొనుగోలు చేశారు. కానీ మినీ స్టేడియం పూర్తి చేయడం మర్చిపోయారు. 

30 సంవత్సరాలు అవుతున్న ముందుకు సాగని పనులు..

మినీ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టి 30 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, నాయకుల ఉదాసీన వైఖరి కారణంగా స్టేడియం పనులు ముందుకు వెళ్లడం లేదని మండలంలోని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు మినీ స్టేడియం పూర్తి చేయాలని అధికారులకు, నాయకులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లారెడ్డి లో ఎంతమంది ఎమ్మెల్యేలు మారిన స్టేడియానికి నిధులు మంజూరు చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోతుంది. నాయకులు మినీ స్టేడియానికి నిధులు మంజూరు చేయిస్తాము అని చెప్పడమే తప్ప చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

క్రీడాకారులకు పుట్టినిల్లుగా తాడువాయి..

తాడువాయి మండలం క్రీడాకారులకు పుట్టినిల్లుగా  పేరు తెచ్చుకుంది. తాడ్వాయిలో వాలీబాల్ క్రీడాకారులు, కబడ్డీ క్రీడ క్రీడాకారులు పుష్కలంగా ఉన్నారు. వాలీబాల్ క్రీడల్లో ఇక్కడి నుంచి రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో రాణించారు, మంచి ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారు. కబడ్డీ క్రీడలో రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో రాణించారు.జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో తాడువాయికి గుర్తింపు ఉంది.

క్రీడాకారులను మరింత ప్రోత్సహిస్తే నైపుణ్యం గల క్రీడాకారులుగా తయారవుతారని ప్రజలు వాపోతున్నారు. తాడువాయిలో క్రీడాకారులకు సరైన స్టేడియం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని క్రీడాకారులు తెలిపారు. తాము క్రీడల్లో నైపుణ్యం సాధించాలని ఉన్న సరైన మైదానం లేకపోవడంతో రాణించలేకపోతున్నామన్నారు.

మినీ స్టేడియం పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగితే క్రీడాకారులకు మంచి అవకాశం గా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మినీ స్టేడియం నిర్మాణం కోసం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాలని క్రీడాకారులు ప్రజలు కోరుతున్నారు.

గేటుకే పరిమితమైన నిర్మాణం

తాడువాయి మినీ స్టేడియం నిర్మాణం పనులు గేటుకు మాత్రమే పరిమితమయ్యాయి. గేటు పెట్టి అధికారులు పనులు వదిలేశారు. మినీ స్టేడియానికి కేటాయించిన ఐదు ఎకరాల పరిధిలో ఫెన్సింగ్ వైర్ వేసి వదిలిపెట్టారు. నిధులు లేకపోవడంతో పూర్తిస్థాయి పనులు జరగలేదు.

వెంటనే నిర్మాణం పనులు చేపట్టాలి 

తాడువాయి మండల కేంద్రంలోని మినీ స్టేడియానికి నిధులు మంజూరు చేసి వెంటనే నిర్మాణం పనులు చేపట్టాలి. ఇక్కడ మినీ స్టేడియం నిర్మాణం పూర్తి అవుతే మండలంలోని క్రీడాకారులు మరింత ముందుకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు, క్రీడాకారులు కోరుతున్నారు.