బాసర ట్రబుల్ ఐటీ
- వరుస ఆందోళనలతో అప్రతిష్ట
- ఆగని ఆత్మహత్యల గోస
- పడిపోయిన ప్లేస్మెంట్ ఉద్యోగాలు అధికారులు, విద్యార్థుల మధ్య సైలెంట్ వార్
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ట్రిపుల్ ఐటీని బాసరలో ప్రారంభించి భవిష్యత్తులో దేశంలోని ఐఐటీ విశ్వ విద్యాలయం ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు సంకల్పం చేశారు. అయితే నిధుల కొరత, వెక్కిరిస్తున్న ఖాళీలు, మౌలిక సదుపాయాల కల్పన సమస్యలుగా మారాయి. విద్యార్థుల అన్నంలో పురుగులు, బొద్దింకలు, నాసిరకం భోజనం, మెనూ పాటించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగినా సమస్య పరిష్కారం కాలేదు.
- ట్రిపుల్ ఐటీలో నిధుల కొరత.. వెక్కిరిస్తున్న ఖాళీలు
- విద్యార్థుల వరుస ఆందోళనతో అప్రతిష్ట
- అత్యవసర వైద్యానికి అక్కెరకురాని ఆసుపత్రి
- బ్లాక్ లిస్ట్‌లోని మెస్సులతోనే భోజనం నిర్వహణ
- ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు
- పడిపోయిన క్యాంపస్ ప్లేస్మెంట్స్
- నెరవేరని ప్రభుత్వాల హామీలు
- అధికారులు, విద్యార్థుల మధ్య కోల్డ్ వార్
- ఉపకులపతి ఏకపక్ష నిర్ణయాలతో ఉద్యమం
- గవర్నర్, కేటీఆర్, రేవంత్, మంత్రులు వచ్చినా మారని దుస్థితి
- వర్సిటీ పరిరక్షణకు ఉద్యమిస్తున్న టీఏసీఎస్ విద్యార్థి సంఘం
(గాజుల రామేశ్వర్)
నిర్మల్, మార్చి 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రామీణ నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటుచేసిన బాసర ట్రిపుల్ ఐటీ (రాజీవ్‌గాంధీ వర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ప్రస్తుతం ట్రబుల్స్ ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థులు సాంకేతిక వైజ్ఞానిక విద్య కోసం బాసర ట్రిపుల్ ఐటీవైపు చూస్తుంటారు. అలాంటి వర్సిటీ నిధుల కొరత, విద్యార్థుల ఆందోళన, అధ్యాపకుల ఖాళీలు, అధికారులు, విద్యార్థుల మధ్య కోల్డ్‌వార్, వీసీ ఏకపక్ష నిర్ణయాలు, విద్యార్థుల ఆత్మహత్యలతో ప్రభావం కోల్పోతూ ట్రిపుల్ ఐటీ కాస్తా ట్రబుల్ ఐటీగా భయాందోళనకు గురిచేస్తున్నది.
సరలో 2005లో ఈ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారు. సువిశాల ప్రాంగణంలో 7,500 మంది విద్యార్థులకు విద్యాబోధన, మౌలిక సదుపాలతో కూడిన క్యాంపస్ వర్సిటీని 2008లో పూర్తిచేశాసి తరగతులు ప్రారంభించారు. తెలంగాణలో మొట్టమొదటి ట్రిపుల్ ఐటీ ఇక్కడే ప్రారంభించి ఐఐటీ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు సంకల్పంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ బీటెక్ (ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు) అందించేందుకు ఈ వర్సిటీని ఏర్పాటుచేశారు.
ఇక్కడ కెమికల్, సివిల్, సీఎస్సీ, ఈఈఈ, ఈసీజీ, మెకానికల్, మెటర్నలాజికల్ ఆఫ్ మెటీరియల్ కోర్సులను ఏర్పాటుచేశారు. ఏటా 1,500 మంది విద్యార్థులు రిజర్వేషన్, గ్లోబల్, ఎన్నారై, ఇతర క్యాటగిరీల్లో మెరిట్ ఆధారంగా ప్రవేశాలు పొందుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 9 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
వెక్కిరిస్తున్న ఖాళీలు.. తగ్గుతున్న నిధులు
బాసర ట్రిపుల్ ఐటీలో 9 వేల మంది విద్యార్థులు చదువుతుండగా వైస్ చాన్స్‌లర్‌తోపాటు డైరెక్టర్, ఏవో అసిస్టెంట్ ప్రొఫెసర్, అతిథి అధ్యాపకులు, చీప్ వార్డెన్, కేర్ టేకర్, సెక్యూరిటీ సిబ్బంది, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరత ఉన్నది. 40 మంది ప్రొఫెసర్లకు 19 మంది మాత్రమే రెగ్యులర్ కాగా, మిగతావారు ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. 40 మంది ఇతర ఉద్యోగుల్లో 18 మంది రెగ్యులర్ కాగా, 22 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
2008లో ప్రారంభమైన ఈ వర్సిటీకి 2015 వరకు బడ్జెట్ భారీగా కేటాయించారు. ప్రస్తుతం ఏటా రూ.50 కోట్ల బడ్జెట్ అవసరముండగా, ప్రభుత్వం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు మాత్రమే ఇస్తున్నదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిధులతో విద్యార్థులకు ల్యాప్ టాప్స్, యూనిఫామ్స్, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఫర్నిచర్, జీతాలు వంటి వాటికి ఖర్చుచేయాల్సి ఉంటుంది. వచ్చిన నిధులను కూడా సక్రమంగా వినియోగించడంలో పరిపాలన విభాగం విఫలమైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఎనిమిదేండ్లు ఎంతో ప్రతిష్ట
ఈ ఆర్జీయూకేటీ 2008 నుంచి 2016 వరకు ఒక వెలుగు వెలిగింది. నాటి ముఖ్యమంత్రులు వైఎస్‌ఆర్, కేసీఆర్ బాసర ట్రిపుల్ ఐటీకి ప్రాధాన్యం ఇస్తూ అవసరం మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. క్యాంపస్ నిర్వహణ, విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, మంచి ఫ్యాకల్టీ, ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటంతో బాసరలో చదువుకున్న విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చింది. 2008 నుంచి 2016 వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో 50 నుంచి 60 శాతం మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్, ప్రభుత్వ ఉద్యోగులు వచ్చాయి.
పోటీ పరీక్షల్లో సైతం రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో బాసర ట్రిపుల్ ఐటీకి మంచి పేరు వచ్చింది. ఇక్కడ సీట్ల కోసం తీవ్ర పోటీ పెరిగింది. నాణ్యమైన విద్యాబోధన, విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు కంపెనీలను ఆకర్షించేవి. బీటెక్ మూడేళ్లు చదువుతున్న విద్యార్థులను వివిధ కంపెనీలు బాసరకు వచ్చి సెలెక్ట్ చేసుకుని మంచి ప్యాకేజీ ఖరారుచేసేవి. బాసర ట్రిపుల్ ఐటీతో కొన్ని కంపెనీలు ఒప్పందం కూడా చేసుకున్నాయి.
కరోనా నుంచి కష్టాలు..
ఈ ట్రిపుల్ ఐటీకి 2019 నుంచి కష్టాలు మొదలయ్యాయి. 2019లో కరోన మొదటి దశ ఆ తర్వాత ఏడాదికి రెండోదశ ఏర్పడటంతో ట్రిపుల్ ఐటీలో చదువులకు ఆటంకం ఏర్పడింది. వర్సిటీని మూసివేసి ఆన్‌లైన్ విద్యా బోధన ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో అప్పటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌లో ట్రిపుల్ ఐటీకి తగిన నిధులు ఇవ్వలేదు.
దీంతో విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై ప్రభావం పడింది. ఇంచార్జి వీసీని నియమించడం.. వారు హైదరాబాద్‌లో ఉంటూ పర్యవేక్షణ చేయడం, పరిపాలన విభాగంలో పనిచేసే ఉద్యోగుల పట్టింపు లేకపోవడం, కాంట్రాక్ట్, అతిథి ఉద్యోగుల ఎంపికలో పారదర్శకత లోపం, భోజన ఏజెన్సీల నిర్వహణ లోపాలు ట్రిపుల్ ఐటీపై ప్రభావం చూపాయి. విద్యార్థులతో వీసీలకు సంబంధాలు తక్కువగా ఉండేవి. దీంతో ఒక్కో సమస్య జట్టిలమవుతున్నది.
భోజనం ఏజెన్సీలపై విద్యార్థుల మండిపాటు
ట్రిపుల్ ఐటీలో 2022 ఆగస్టులో భోజనం ఏజెన్సీల నిర్వహణ లోపంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అన్నంలో పురుగులు, బొద్దింకలు, నాసిరకం భోజనం, మెను పాటించకపోవడంపై విద్యార్థులు అధికారులకు తెలిపిన సమస్య పరిష్కారం కాలేదు. అదే సందర్భంలో భోజనం చేసిన 300 మంది విద్యార్థులు అస్వస్థతకుగురయ్యారు. ఈ క్రమంలోనే ఏజెన్సీలు మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదని విద్యార్థులు మొదట ఆందోళనకు శ్రీకారంచుట్టారు.
తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ సాలిడారిటీ (టీఎస్‌ఏఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆకాష్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పురుగుల అన్నం పెట్టిన ఏజెన్సీలను రద్దు చేయాలని, రెగ్యులర్ వీసీని నియమించాలని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను రెగ్యులర్‌వారిని నియమించాలని, దవాఖాన స్థాయిని పెంచాలని, బడ్జెట్ పెంచి విద్యార్థుల భాగస్వామ్యంతో పారదర్శకంగా ఖర్చు చేయాలని డిమాండ్‌చేస్తూ 4,500 మంది విద్యార్థులు 10 రోజులపాటు ఎండ, వానను లెక్కచేయకుండా భోజనాలు మాని నిరసన వ్యక్తంచేశారు.
ఈ ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు చలో బాసర పేరుతో వారికి మద్దతుగా నిలిచాయి. అప్పటి గవర్నర్ తమిళిసై సైతం ట్రిపుల్ ఐటీని సందర్శించి సమస్యలపై స్పందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో స్పందించిన అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంత్రులను పంపి విచారణచేయించింది.
లోపాలు గుర్తించి, భోజన ఏజెన్సీలను రద్దుచేసి, వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేసినట్టు అప్పటి కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో తమ పోరాటానికి న్యాయం జరిగిందని భావించిన విద్యార్థులు ఆందోళనలు తాత్కాలికంగా విరమించారు. భోజన ఏజెన్సీలో మరొకటి పెంచారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీలు రద్దవుతాయని విద్యార్థి సంఘాలు భావించగా, పేర్లు మార్చి మళ్లీ బాసరలో భోజన ఏజెన్సీలు నిర్వహిస్తున్నట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్లాక్ లిస్టులో, కేసుల్లో ఉన్న భోజన ఏజెన్సీలకు మళ్లీ అప్పగించడం వెనుక ఆంతర్యంపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ట్రిపుల్ ఐటీలో మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపు, వీసీ ఏకపక్ష నిర్ణయాల రద్దు, 2008 బాసర ట్రిపుల్ ఐటీ యాక్టు అమలు తదితర డిమాండ్లను విద్యార్థులు లేవనెత్తి టీఎస్‌ఏఎస్ ఆధ్వర్యంలో నాటి గవర్నర్, సీఎం, ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్లారు. ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి సంఘాలు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదుచేశాయి.
సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ
అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాటి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి ట్రిపుల్ ఐటీని సందర్శించి అధికారులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. బడ్జెట్ పెంచి విద్యార్థులకు యూనిఫామ్‌లు, మౌలిక సదుపాయాలు వంటి పలు హామీలు ఇచ్చారు. పది నెలల్లో తిరిగి వస్తామని చెప్పిన కేటీఆర్ మళ్లీ వచ్చి, స్నాతకోత్సవంలో పాల్గొని కొన్ని హామీలు నెరవేర్చారు.
ఐదేండ్లలో పెరిగిన ఆత్మహత్యలు
ట్రిపుల్ ఐటీలో 2008 నుంచి విద్య బోధన ప్రారంభం కాక, ఇప్పటివరకు 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. వీరంతా ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉరేసుకోవడం, బిల్డింగ్ పైనుంచి దూకడం చేశారు. 2020 నుంచి 10 మంది వరకు బలవన్మరణాలకు పాల్పడ్డారు. చనిపోయినవారిలో జాదవ్ బబ్లు, దీపిక, నికిత, భానుప్రసాద్, రాథోడ్ సురేశ్, స్వాతి ప్రియ, బోండ్ల సంజయ్, వసంత, తేజస్విని తదితరులు ఉన్నారు. అయితే వీరి ఆత్మహత్యల వెనుక వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అంశాలు ఉన్నాయి.
విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులు, మానసిక ప్రవర్తన తదితర కారణాల పర్యవేక్షణలో చీఫ్ వార్డెన్, వార్డెన్, కేర్ టేకర్ వైఫల్యం ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనారోగ్యం బారినపడినా, ఆత్మహత్యలకు ప్రయత్నించి గాయపడ్డా, అస్వస్థకు గురైనా ఇక్కడి దవాఖానలో ప్రాథమిక చికిత్సలకే పరిమితమవుతున్నది. ఆ విద్యార్థులను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్, 50 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలకు తరలించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఇక్కడ ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు, స్టాఫ్ నర్స్, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు ఉన్నా మెరుగైన వైద్యసేవలు అందించే మౌలికసదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. ఉజ్వల భవిష్యత్తు కోసం బాసర ట్రిపుల్ ఐటీలో చేర్పిస్తే పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం తల్లిదండ్రులకు తీరని దుఖాన్నిమిగులుస్తున్నది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడే స్పందిస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.
అడ్మినిస్ట్రేటివ్ పరంగా సమస్యలు
వర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమై అవి జఠిలంగా మారుతున్నాయి. వీసీ, ఏవో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని, తమకు అనుకూలంగా ఉన్నవారిని ఉద్యోగాలుగా నియమించుకోవడం, మాట వినని అధికారులపై చర్యలు తీసుకోవడం, ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులపై ఒత్తిడి పెంచి ఇబ్బందులకు గురిచేయడం, కొందరు విద్యార్థులను ఫెయిల్ చేయడం వంటి ఘటనలు జరిగినట్టు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల వారం రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరోసారి విద్యార్థి సంఘాల ఆందోళనకు కారణం అయింది.
ఇటీవలి ఓ విద్యార్థి మృతి ఘటనలో వీసీ నిర్లక్ష్యమే కారణమని, వెంటనే ఆయనను తొలగించాలని విద్యార్థులు ఆందోళనచేశారు. దీనికి తోడు ఐదేళ్లలో త్రిబుల్ ఐటీ నిధుల్లో అక్రమాలపై ఆర్టీఏ ద్వారా దరఖాస్తు చేసుకున్నా లెక్కలు చూపడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో మనస్థాపానికి గురైన వీసీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే వీసీగా నియమితులైన గోవర్ధన్ పాత ఏవోను తొలగించి తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకున్నారని ఆరోపణలున్నాయి.
కొరవడిన సమన్వయం
వర్సిటీ అధికారులు, విద్యార్థుల మధ్య సమన్వయం రోజురోజుకు కొరవడుతున్నది. విద్యార్థి సంఘాలు లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై అధికారులు వివరణ ఇవ్వాలి. వారి పరిధిలోని సమస్యలు పరిష్కరించాలి. పరిష్కారంకాని సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. విద్యార్థులతో సమన్వయంగా ఉంటూ చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. విద్యార్థులు కూడా వీసీ, ఇతర అధికారుల పట్ల గౌరవంగా ఉంటూ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.
ఆందోళనలు చేసినప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తున్నా రు. పోలీసులు విద్యార్థులను బెదిరిస్తూ, కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మరింత రెచ్చిపోతున్నారు. ట్రిపుల్ ఐటీలో శాంతి భద్రతలకు ప్రాధా న్యం ఇస్తూ దత్తత తీసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల మూడు నెలలకే విరమించుకున్నారు. ప్రస్తుతం ఏఎస్పీ సాయికిరణ్‌ను త్రిబుల్ ఐటీకి ఇన్‌చార్జిగా నియమించారు.
వర్సిటీ ప్రాంగణంలో మత్తు పదార్థాలతో బయటపడ్డ ఘటనలు కలకాలం రేపాయి. సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య భేదాబిప్రాయాలు వచ్చాయి. ఆందోళన చేసినప్పుడల్లా అధికారులు సెలవులు ప్రకటించి బలవంతంగా ఇంటికి పంపడంపై విమర్శలు వస్తున్నాయి. వేధింపులపై ఇటీవలే ఓ విద్యార్థి వీడియో రిలీజ్ చేయడం కలకలం సృష్టించింది.
ఇప్పటివరకు త్రిపుల్ ఐటీకి ఉపసంచాలకులుగా పనిచేసిన సత్యనారాయణ, అశోక్‌కుమార్, రమణ, గోవర్ధన్ ఎప్పటికప్పుడు పరిణామాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి దశలవారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది. అయితే మీడియాపై ఆంక్షలు కొన్ని సమస్యలను బయటకు రాకుండా చేస్తున్నాయి.
దిద్దుబాటు చర్యలపై ప్రభుత్వం దృష్టి
త్రిపుల్ ఐటీలో పరిణామాలు, విద్యార్థులు అధికారుల మధ్య ఏర్పడ్డ వివాదాలు, 12 డిమాండ్ల పరిష్కారం, నిధుల విడుదల, ఖాళీ పోస్టుల భర్తీ, మెస్సుల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రుల సమన్వయంతో త్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ బాధ్యతలు జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. 2020 నుంచి విద్యార్థులకు ఉపకార వేతనాలు రూ.27 కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నది.
ఒప్పంద ఉద్యోగులది మరో సమస్య
రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడంతో ఒప్పందంపై పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర సిబ్బంది ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తగిన వేతనాలు అందడం లేదని, రెగ్యులర్ చేయాలని డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నారు. సుమారు 400 మంది కొందరు ఏజెన్సీ కింద, మరికొందరు ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్నారు.
అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించా
త్రిపుల్ ఐటీలో పరిణామాలకు అధికారులు పూర్తి బాధ్యత వహించాలి. వీసీ, ఇతర అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థుల డిమాండ్లను ఏమాత్రం పరిష్కరించకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ప్రభుత్వం కూడా త్రిపుల్ ఐటీకి అవసరమైన నిధులు కేటాయించి, అన్ని రకాల పోస్టులు భర్తీచేసి, నాణ్యమైన విద్యను అందించాలి. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని త్రిబుల్ ఐటీని బాగుచేయాలి.
రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే
నిధులపై ఆరోపణలను ఖండిస్తున్నా
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ అకాడమిక్ ఇయర్ యాక్షన్ ప్లాన్ అమలుచేస్తున్న. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రతి రూపాయి విద్యార్థుల మౌలిక సదుపాయాల కలపనకు వెచ్చిస్తున్నాం. కొందరు విద్యార్థులు అసత్యపు ఆరోపణతో ఉద్యమాలు చేస్తూ త్రిపుల్ ఐటీకి మచ్చ తెస్తున్నారు.
విద్యతోపాటు భవిష్యత్తులో అన్ని ప్రొఫెషనల్ రంగాల్లో విద్యార్థులు రాణించేలా కెరీర్ గౌడ్స్ అందిస్తున్నాం. లోపాలను గుర్తించి ప్రభుత్వ సహకారంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆత్మహత్యల నివారణకు కౌన్సిలర్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నాణ్యమైన విద్యాబోధన చేసే ప్రొఫెసర్లు ఇతర సిబ్బందిని నియమించుకొని విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తున్నాం. విద్యార్థులు కూడా తమకు పూర్తిగా సహకరించాలి.
గోవర్ధన్, బాసర త్రిపుల్ ఐటీ వీసీ
హక్కుల కోసం కొట్లాడుతూనే ఉంటా
త్రిబుల్ ఐటీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు వీసీ, అధికారులే బాధ్యత వహించాలి. ఐదేళ్లుగా వచ్చిన నిధులపై ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ ఇవ్వడం లేదు. వచ్చిన నిధులు ఎన్ని, ఖర్చు చేసినవి ఎన్ని, విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన చర్యలు తీసుకోవాలి.
ఆసుపత్రి స్థాయిని పెంచాలి. వీసీ తమకు అనుకూలమైన వారిని ఉద్యోగంలో పెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల పాత ఏవోను తొలగించి మిత్రుడైన మురళి దర్శన్‌ను నియమించుకుని అక్రమాలకు తెర లేపుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి.
ఆకాశ్ యాదవ్, టీఎస్‌ఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
ముఖ్యమంత్రి చొరవ చూపాలి
త్రిబుల్ ఐటీ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలి. తొమ్మిది వేల మంది విద్యార్థులు చదువుతున్న ఇక్కడ ఏటా బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులు భర్తీ చేయాలి. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను తక్షణం పరిష్కరించి భోజనం ఏజెన్సీలపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా మరో దైర్యం కలిగించేలా మానసిక వైద్య నిపుణులతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
ఎన్ శ్రీనివాస్ సీనియర్ విద్యావేత్త,
ఆందోళన మాట వింటేనే భయమేస్తుంది
గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక వైజ్ఞానిక విద్యను అందించే బాసర ట్రిపుల్ ఐటీలో మా బాబుకు సీటు వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. వెంటనే చేర్పించాం. సమస్యల పరిష్కారానికి విద్యార్థులు చేస్తున్న ఆందోళన కారణాలతో త్రిబుల్ ఐటీకి సెలవులు ఇవ్వడం విద్యకు ఆటంకం ఏర్పడుతున్నది. ఆందోళన మాట వింటేనే భయమేస్తున్నది. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలి. నాలం సబితారాణి, విద్యార్థి తల్లి
విపక్ష నేతగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరికలు
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో టీఎస్‌ఏఎస్ చేసిన పోరాటం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచింది. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా అప్పటి గవర్నర్ ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి, నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,
నేటి కేంద్రమంత్రి బండి సంజయ్, సీపీఐ నేత నారాయణ, బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌తోపాటు పలు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆంక్షలు విధించి బాసరకు వచ్చే నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసింది. పోలీసుల కండ్లు కప్పి వచ్చి త్రిపుల్ ఐటీలో గోడ దూకుతున్న రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. త్రిబుల్ ఐటీలో సరిణామాలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు.




