28 March, 2026 | 3:08 AM

శాసనసభ నామమాత్రమేనా?

28-03-2026 01:19 AM

విరామాలతో కాలక్షేపం!

  1. పక్కదారి పడుతున్న అసలు ఉద్దేశం

ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజులు అసెంబ్లీ

అప్పట్లో బడ్జెట్ సెషన్ 30 రోజులపాటు

ఇప్పుడు సగటున కేవలం 15 రోజుల్లోపే..

గతం కంటే మెరుగ్గానే ప్రతిపక్షాలకిచ్చే సమయం

సభా సమయం వినియోగంపై సభ్యుల అసంతృప్తి

హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి) : రాష్ట్రంలో శాసనసభ సమావేశాలకు, దేశంలో పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎం దుకంటే చట్టాలు, విధానాల రూపకల్పనకు ఆమో దం తెలిపే రాజ్యాంగ పరమైన అధికారం అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఉంది. అందులోనూ ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రజల దృష్టి అంతా ఈ సమావేశాలపై కేంద్రీకృతమవుతుంది.

అయితే ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో కొనసాగుతున్న బడ్జెట్‌పై చర్చలను పరిశీలిస్తే అసెంబ్లీ సమా వేశాలు అసలు ఉద్దేశాన్ని కోల్పోతున్నాయని రాజకీయ, విశ్లేషకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సంవత్సరానికి దాదాపు 60 రోజులకు పైగా సమావేశమై ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చలకు వేదికగా నిలిచిన అసెంబ్లీ, ఇప్పుడు సగటున 15 రోజులకు లోపే పరిమితమవుతూ నామమాత్రంగా నడు స్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ ప్రజాస్వామ్య చర్చలకు ప్రధాన వేదికగా నిలిచేది. బడ్జెట్ సెషన్ ఒక్కటే దాదాపు 30 రోజులు కొనసాగేది. శాఖల వారీగా సుదీర్ఘ చర్చలు జరిగి, ప్రభుత్వంపై ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నలు సం ధించే పరిస్థితి ఉండేది. ప్రతి అంశం లోతుగా చర్చకు వచ్చి, విధానాలపై సమగ్ర సమీక్ష జరిగేది. ప్రస్తుతం మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ సమావేశాలు సగటున 15 రోజులకు లోపే పరిమితమవుతూ, కొన్నిసార్లు ఒక్క సెషన్ 5 రోజుల్లోనే ముగుస్తోంది. ఇందులోనూ విరామాలు, పరిమిత కార్యక్రమాలతో అసలు చర్చలకు దక్కే సమయం మరింత తగ్గిపోతోంది.

ప్రశ్నోత్తరాలు కూడా రెండు మూడు ప్రశ్నలకే పరిమితమవడంతో, సభ్యులు ప్రభుత్వాన్ని సమర్థంగా ప్రశ్నించే అవకాశం తగ్గిపోయింది. ఈ మార్పుతో శాసనసభ తన అసలు పాత్ర అయిన ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చలు, ప్రభుత్వంపై పర్యవేక్షణ వంటి అంశాల్లో వెనుకబడు తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే సమావేశాల సంఖ్యలోనే కాదు, చర్చల నాణ్యతలో కూడా స్పష్టమైన తగ్గుదల కనిపించడం ప్రస్తుతం ప్రధాన ఆందోళనగా మారింది.

ఉపయోగపడుతున్నాయా?

ప్రస్తుతం శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నామనే గణాంకాలు ఉన్నప్పటికీ, అవి ఎంతవరకు సమర్థవంతంగా సాగుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. సమావేశాల సంఖ్యను చూపించడం తప్ప, వాటిలో జరిగే చర్చలు, నిర్ణయాలు ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నాయన్న అంశంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంవత్సరానికి కేవలం 10 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించడం, వాటిలోనూ అనేక గంటలు విరామాలకు లేదా పరిమిత కార్యక్రమాలకు కేటాయించబడటం వల్ల అసలు చర్చలకు దక్కే సమయం మరింత తగ్గుతోంది.

దీంతో అసెంబ్లీ ఒక చర్చా వేదికగా కాకుండా, కేవలం విధి నిర్వహణ స్థాయికి పరిమితమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నోత్తరాలు, తక్షణ చర్చలు, శాఖల వారీగా సమీక్షలు వంటి కీలక అంశాలు కూడా సమగ్రంగా జరగకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. అనేక ముఖ్యమైన ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే సమావేశాలు ముగుస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది.

పరిమితంగానే ప్రశ్నోత్తరాలు..

శాసనసభలో ప్రజా సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అత్యంత కీలక వ్యవస్థ ప్రశ్నోత్తరాల సమయం. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థపై సరైన పట్టింపు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు గంటల తరబడి సాగిన ప్రశ్నోత్తరాలు, ఇప్పుడు కేవలం అంతంత మాత్రంగానే మిగిలిపోతున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. గతంలో సభ్యులు తమ నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ మంత్రులను వివరంగా ప్రశ్నిం చేవారు.

అనుబంధ ప్రశ్నల ద్వారా అసలు విషయాన్ని వెలికితీసే అవకాశముండేది. దీంతో ప్రభుత్వ పనితీరుపై గట్టి పర్యవేక్షణ సాధ్యమయ్యేది. ప్రస్తుతం మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కేవలం గంటన్నర పాటే ప్రశ్నోత్తరాల సమయం కేటాయించడంతో రోజుకు రెండు లేదా మూడు ప్రశ్నలకే పరిమితమవుతోంది. అనేక ప్రశ్నలు చర్చకు రాకుండానే లిఖితపూ ర్వక సమాధానం’తో ముగుస్తున్నాయి.

చర్చకు వచ్చిన ప్రశ్నలకూ సమగ్ర సమాధానాలు రాకపోవడం సభ్యుల్లో అసంతృప్తిని పెంచుతోంది. అంతేకా కుండా అనుబంధ ప్రశ్నలకు తగినంత అవకాశం లేకపోవడం, సమయాభావం పేరుతో చర్చలను త్వరగా ముగించడం వంటి పరిణామాలు ప్రశ్నోత్తరాల అస లు ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో సభ్యులు ప్రభుత్వాన్ని సమర్థంగా ప్రశ్నించే అవకాశాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే శాసనసభలో ప్రభుత్వంపై పర్యవేక్షణ బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సమాధానాలేవీ?

ఇటీవల కాలంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాలు కొంత పెరిగాయన్న అభిప్రాయం ఉన్నా, వాటి ఫలితాల విషయంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. సభలో మాట్లాడే సమయం ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆ చర్చలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిస్పందన కూడా అంతే కీలకం. ఈ విషయంలోనే ప్రధాన లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రతిపక్షం లేవనెత్తే అంశాలు చాలాసార్లు ప్రజా సమస్యలకు సంబంధించినవే అయినప్పటికీ, వాటిపై సుదీర్ఘ చర్చలు జరగకుండా త్వరగా ముగించడం లేదా పరిమిత సమాధానాలతో సరిపెట్టడం జరుగుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చర్చలు సాగినా, మం త్రుల సమాధానాలు సాధారణ స్థాయిలోనే ఉండిపోవడం, వివరాల లోపం ఉండటం వల్ల అసలు సమస్యపై స్పష్టత రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అదనంగా, ప్రతిపక్షం అడిగే అనుబంధ ప్రశ్నలకు తగినంత సమయం కేటాయించకపోవడం, సమయాభావం పేరుతో చర్చలను ముగించడం వంటి పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షానికి ఉన్న అవకాశం కూడా పూర్తిగా ఉపయోగపడకుండా పోతుందన్న భావన బలపడుతోంది. ఇక సభలో లేవనెత్తిన అంశాలపై తర్వాత తీసుకునే చర్యల విషయంలో కూడా స్పష్టత లేకపోవడం మరో సమస్యగా మారింది.

చర్చలు జరిగినా, వాటి ఫలితంగా నిర్ణయాలు లేదా చర్యలు తీసుకున్న ఉదాహరణలు తక్కువగా ఉండటం సభ్యుల్లో నిరుత్సాహాన్ని పెంచుతోంది. మొత్తానికి, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ, అది ప్రజాసమస్యల పరిష్కారానికి దారితీయడం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కీలకమైన పాత్ర పోషించాలంటే, వారికి కేవలం సమయం ఇవ్వడం సరిపోదని, వారి ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు, చర్చలకు స్పష్టమైన ఫలితాలు రావడం అవసరం.

ప్రస్తుతం శాసన సభ నిర్వహణపై అసంతృప్తి కేవలం ప్రతిపక్షానికే పరిమితం కాకుండా, అన్ని పార్టీల సభ్యుల్లోనూ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సభలో మాట్లాడే సమయం పరిమితం కావడం, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోవడం, ముఖ్యమైన అంశాలు చర్చకు రాకుండానే ముగియడం వంటి పరిణామాలు సభ్యుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా చర్చలు.. 

ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత శాఖల వారీగా సుదీర్ఘ చర్చలు జరిగేవి. వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, ఆరోగ్య రంగాలపై ఒక్కో శాఖపై 2 రోజులు చర్చ కొనసాగేది. జలయజ్ఞం వంటి భారీ ప్రాజెక్టుల సమయంలో ప్రాజెక్ట్ ఖర్చులు, టెండర్లు, ప్రయోజనాలపై సుదీర్ఘ చర్చ చేపట్టి సభ్యులు ప్రాంతాల వారీగా సమస్యలు లేవనెత్తడం, మంత్రులు వివరంగా సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది.

రైతు సమస్యలు, విద్యుత్, పంట నష్టాలు, రైతు ఆత్మహత్యలు వంటి అంశాలపై గంటల తరబడి చర్చలు జరిగేవి. రాష్ట్ర విభజన (2013 సమయంలో జరిగిన చర్చలు చరిత్రాత్మకంగా నిలిచాయి. సభ్యులు తమ అభిప్రాయాలను విస్తృతంగా వ్యక్తీకరించడంలో భాగంగా అనేక రోజుల పాటు చర్చలు కొనసాగాయి. ఆనాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నపై అనేక అనుబంధ ప్రశ్నలకు మంత్రులను వివరంగా సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది.

గతంలో సభ్యులకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి విస్తృత అవకాశం లభించేది. ప్రస్తుతం పరిస్థితులతో పోలిస్తే, ఆ కాలంలో జరిగిన ఈ సుదీర్ఘ చర్చలు శాసనసభ స్థాయిని ఎంతగా ప్రతిబింబించాయో స్పష్టంగా కనిపిస్తుంది.

విరామం ఇవ్వడంపై విమర్శలు.. 

ఇప్పటికే పరిమిత రోజుల్లో నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాల్లో విరామాలు కీలక సమస్యగా మారుతున్నాయి. సెషన్లు తక్కువ రోజుల్లోనే ముగుస్తుండగా, ఆ రోజుల్లో కూడా తరచుగా విరామాలు ఇవ్వడం వల్ల అసలు చర్చల సమయం మరింత తగ్గిపోతోంది. దీంతో సభలో నిరంతర చర్చల వాతావరణం దెబ్బతింటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన అంశంపై సభ్యులు చర్చను కొనసాగించే సమయంలోనే విరామం ప్రకటించటం, తిరిగి చాలా ఆలస్యంగా ప్రారంభం కావడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది.

దీనివల్ల అంశంపై లోతైన విశ్లేషణ జరగకుండా, చర్చలు విభజితంగా మారుతున్నాయి. ఒకే అంశంపై సమగ్ర దృక్కోణం ఏర్పడకపోవడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. విరామాల వల్ల ప్రశ్నోత్తరాల సమయం, తక్షణ చర్చలు, ప్రైవేట్ మెంబర్ బిల్లులు వంటి కార్యక్రమాలు కూడా ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో, ఈ విరామాలు సభ్యులకు లభించే అవకాశాలను మరింత పరిమితం చేస్తున్నాయి.

సభ నిర్వహణలో సమయాన్ని సమర్థంగా వినియోగించడం అత్యంత కీలకం. అయితే విరామాల అధిక సమయం వృథా అవుతుందన్న భావన సభ్యుల్లో పెరుగుతోంది. దీంతో సభలో చర్చల సార్థకత తగ్గిపోతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం శాసన సభ నిర్వహణలో కనిపిస్తున్న లోపాలను దృష్టిలో ఉంచుకొని వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలను క్రమబద్ధంగా నిర్వహిస్తూ, ప్రతి సెషన్‌కు తగిన సమయం కేటాయించాలి.

శాఖల వారీగా సుదీర్ఘ చర్చలు జరిగేలా షెడ్యూల్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నోత్తరాల సమయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. రోజుకు ఎక్కువ ప్రశ్నలు చర్చకు వచ్చేలా వ్యవస్థను బలోపేతం చేయాలి. సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమగ్రంగా, స్పష్టంగా సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యతను కచ్చితంగా అమలు చేయాలి.

సభలో చర్చించిన అంశాలపై తర్వాత చర్యలు తీసుకునే వ్యవస్థను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విరామాలను పరిమితంగా ఉంచుతూ సమయాన్ని సమర్థంగా వినియోగించాలి. ప్రైవేట్ మెంబర్ బిల్లులు, తక్షణ చర్చలు వంటి అంశాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.