2 September, 2026 | 8:52 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

రైతన్నకు ఇదేం ఖర్మ!?

25-04-2026 | 01:59am
  1. గన్ని సంచులు రైతులే తెచ్చుకోవాలట!
  2. మక్కల కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచుల కొరత

మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఓవైపు ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం, మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించడంతో అన్నదాతలు ప్రభుత్వ అధికారుల మాటలు విశ్వసించి కొనుగోలు కేంద్రాలకు అందించిన ధాన్యాన్ని, మక్కలను తీసుకువస్తే తీరా కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు తిష్ట వేయడంతో అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను ఇప్పుడు విక్రయించడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్ని సంచుల కొరత, లారీల ఇబ్బందుల వల్ల రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇనుగుర్తి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.  జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా, పంట కొనుగోళ్లకు జిల్లా వ్యాప్తంగా 21 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ సంస్థ ఏర్పాటు చేసింది.

అయితే డిమాండ్ కు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నిసంచులు సమకూర్చకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలుకు ఎంపిక చేసిన వేల బస్తాల మక్కజొన్నలు కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయాయి. ఈ క్రమంలో గన్ని సంచుల కొరత విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, మార్క్ఫెడ్ సంస్థ పంపలేదని, మీరే గన్ని సంచులు సమకూర్చుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులకు తేల్చి చెబుతున్నారు.

దీనితో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించే పరిస్థితి లేక సొంతంగా గన్ని సంచులను కొనుగోలు చేసి మక్కలకు కాంటా పెట్టించి మార్క్ఫెడ్ సంస్థకు అప్పగిస్తున్నారు. దీనితో ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో వివిధ రకాల చార్జీలను చెల్లిస్తున్న రైతులు, అదనంగా గన్ని సంచుల భారాన్ని కూడా మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో రైతు గన్ని సంచికి ఒక్కంటికి 26 రూపాయలు చెల్లించి ఖరీదు చేసి మక్కలను మార్క్ఫెడ్ సంస్థకు అప్పగిస్తున్నారు. అయితే మార్క్ఫెడ్ సంస్థ రైతుల ఖాతాల్లోకి గన్ని బస్తాకు ఒక్కంటికి 21 రూపాయలను మక్కల డబ్బులతో పాటు రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని కేసముద్రం మార్క్ఫెడ్ సంస్థ కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ మల్లారెడ్డి తెలిపారు. 

అమ్మడానికి పైసలే!

కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను విక్రయానికి తీసుకువస్తే, కార్మికులకు కూలి డబ్బులతో పాటు గన్ని సంచులకు డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుండడంతో పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా పైసలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడడం దారుణం. బస్తాకు ఒక్కంటికి 26 రూపాయలు ఖర్చు చేస్తే, ప్రభుత్వం మాకు 21 రూపాయలు ఇస్తుందని చెప్పడం ఎంతవరకు సమంజసం. అటు కూలి చార్జీలు, ఇటు గన్ని బస్తాకు ఒక్కంటికి ఐదు రూపాయలు చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

- మూడావత్ మంజ్య, రైతు, మహమూద్ పట్నం