7 March, 2026 | 10:56 PM

ఆయుధ నిల్వల మాటేమిటి?

05-03-2026 12:00 AM

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఐదోరోజుకు చేరుకున్నది. ఐదురోజులైనా ఈ మూడు దేశాలు యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న తీరులో దాడులు కొనసాగిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి భారీ క్షిపణులు, ఫైటర్ జెట్లు, అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్‌పై విరుచుకుపడుతుంటే, అటు ఇరాన్ కూడా తామేం తక్కువ తినలేదన్నట్లుగా తమ దగ్గరున్న అత్యాధునిక ఆయుధాలన్నింటినీ ప్రయోగిస్తున్నది.

చర్చలకు ఆస్కారం లేదని ఇరాన్ ఇప్పటికే తేల్చేయగా, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌తో చర్చల సమయం దాటిపోయిందని వ్యాఖ్యానించారు. యుద్ధం మరో నాలుగైదు వారాలు కొనసాగే అవకాశముందని కూడా తెలిపారు. మరికొన్ని రోజుల ఇలానే యుద్ధం కొనసాగితే మాత్రం ఆయా దేశాల వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోయే అవకాశముంది. ఇదే విషయమై పెంటగాన్ రక్షణ శాఖ అమెరికాను హెచ్చరించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

ఇరాన్‌తో యుద్ధం కారణంగా క్షిపణి, ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయని, మరో పది రోజుల పాటు దాడులు కొనసాగితే ఆయుధ నిల్వ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదముందని పెంటగాన్ పేర్కొంది. ఒక పక్క అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు ధరల భారంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ప్రజాధనం వృధా చేయడం సరైన చర్యేనా అన్న చర్చ మొదలైంది.

ఇరాన్‌పై దాడిలో అమెరికా అత్యాధునిక ఫైటర్ జెట్లతో పాటు వార్ ఫేర్ విమానాలు, థండర్ బోల్ట్, రీపర్ డ్రోన్‌లు ఉపయోగిస్తున్నది. అంతేకాదు రెండేళ్లుగా పశ్చిమాసియాలో జరుగుతున్న ప్రతీ గొడవలోనూ అమెరికా తలదూర్చి ఖర్చు చేసిన మొత్తం దాదాపు 3.1 లక్షల కోట్ల పైమాటే. ఇజ్రాయెల్‌కు సాయం, యెమెన్, ఇరాన్ వంటి ప్రాంతాల్లో ఆపరేషన్ల పేరుతో ఆ దేశ ఆయుధ నిల్వ తరుగుతూ వస్తోంది.

ప్రస్తుతం అమెరికా రక్షణ బడ్జెట్ 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరినప్పటికీ ఆ నిధులు సరిపోని పరిస్థితి. ఇజ్రాయెల్‌కు వైమానిక దళం ప్రధాన బలం. ఎఫ్ మెరుపు యుద్ధ విమానాలతో పాటు ఆధునిక ట్యాంకులు, సాయుధ వాహనాలు, సముద్రంలో క్షిపణి నౌకలు, జలాంతర్గాములు ఆ దేశం సొంతం. ఐరన్ డోమ్ వ్యవస్థ ఇజ్రాయెల్‌కు రక్షణ కవచం. అయితే హమాస్‌తో పోరు, గతేడాది ఇరాన్‌తో 12 రోజుల యుద్ధంతో ఇజ్రాయెల్ ఆయుధ శక్తి మందగించింది. 2026లో ఇజ్రాయెల్ రక్షణ రంగానికి దాదాపు 35 బిలియన్ డాలర్లు కేటాయించింది.

అమెరికా, ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఆయుధ నిల్వ సామర్థ్యంలో ఇరాన్ వెనుకబడినప్పటికీ, ఇరాక్‌తో యుద్ధం తర్వాత క్షిపణుల తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇరాన్ వైమానిక దళంలో ఇప్పటికీ పాత యుద్ధ విమానాలే ఉన్నప్పటికీ సమర్థంగా పనిచేస్తున్నాయి. 2వేల కిలోమీటర్ల పరిధిని సులువుగా ఛేదించే బాలిస్టిక్ క్షిపణులను వేల సంఖ్యలో కలిగి ఉన్నది.

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై వీటితోనే దాడులు చేస్తున్నది. దీనికి తోడు 2 లక్షల మందితో కూడిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వ్యవస్థ ఇరాన్‌కు అదనపు బలం. అంతిమంగా యుద్ధమంటే గెలుపోటములు కాదు, అది దేశాల ఆర్థిక భవిష్యత్తును పణంగా పెట్టడమే అవుతోంది. యుద్ధం వీలైనంత త్వరగా ముగిస్తేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిదని గ్రహించాలి.  అలాగాక యుద్ధం కొనసాగిస్తే మాత్రం అమెరికా సహా ఇజ్రాయెల్, ఇరాన్‌లు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోవడం ఖాయం.