దర్యాప్తు సంస్థలపై మరక!
భారత ఫెడరల్ వ్యవస్థలో ప్రాంతీయ పార్టీలు ప్రాణవాయువులాంటివి. గత దశాబ్ద కాలంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల ఉనికిని నామరూపాలు లేకుండా చేయడమే ఏకైక అజెండాగా పెట్టుకుందన్న విమర్శలు పెరిగిపోయాయి.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు, కేంద్ర దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ) పారదర్శకతను దెబ్బతీసేలా వాడుకోబడ్డ తీరు చర్చనీయాంశమైంది.
ఇది కేవలం అవినీతిపై పోరాటం కాదు, ఇది ప్రాంతీయ ఆత్మగౌరవంపై కేంద్రం సాగించిన ఒక ప్రణాళికాబద్ధమైన దాడి. ఎటువంటి పక్కా ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ ప్రత్యర్థులను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసిన యుద్ధంలో చివరకు న్యాయమే గెలిచింది. బీజేపీకి దక్షిణాదిలో పాగా వేయడం తలకు మించిన భారంగా మారిపోయింది.
ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో తమ పార్టీ తట్టుకోలేకపోతుందన్న అభిప్రాయానికి వచ్చిన బీజేపీ లిక్కర్ స్కామ్‌ను అస్త్రంగా ఎంచుకుంది. ఎటువంటి పక్కా ఆధారాలు లేకుండా, ఒకరిద్దరి వాంగ్మూలాల ఆధారంగా ప్రత్యర్థి పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కక్ష కనిపిస్తున్నది. ఢిల్లీలో ఆప్‌ని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఏకకాలంలో దెబ్బకొట్టాలనే ప్రయత్నం చేసినప్పటికీ అది సఫలం కాలేదు. తాజాగా కోర్టులో ఆరోపణలు కూడా పేకమేడల్లా కూలిపోవడం మోదీ సర్కార్‌కు చెంపపెట్టు.
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రస్థానాన్ని గమనిస్తే, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ కాషాయ జెండా ఎగరడం కష్టంగా మారింది. బెంగాల్‌లో మమత, తమిళనాడులో స్టాలిన్, తెలంగాణలో కేసీఆర్ వంటి నేతలు మోదీ, అమిత్ షా ద్వయానికి కొరకరాని కొయ్యలుగా మారారు. ప్రాంతీయ పార్టీలు ప్రజల నాడిని పట్టుకుని పనిచేస్తాయి కాబట్టే జాతీయ పార్టీ అయినప్పటికీ బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో స్థానం అంతంతమాత్రమే.
అందుకే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఆయా ప్రాంతీయ పార్టీల నేతల ప్రతిష్టను మంటగలిపి, వారిని జైలుకు పంపి, పార్టీలను చీల్చడమే మోదీ సర్కార్ అనుసరిస్తున్న కౌటిల్య వ్యూహమని చెప్పొచ్చు. అంతేకాదు దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయనే మాట పరిహాసంగా మారింది. ఈ సంస్థలు పూర్తిగా కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయాయి.
ముందే ఒక స్క్రిప్ట్ రాసుకుని, దానికి అనుగుణంగా అరెస్టులు చేయడం, మీడియా ద్వారా బురద చల్లడం ఒక పథకం ప్రకారం జరుగుతోంది. 2026లో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి ఒక పరీక్షా సమయం. దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయాలు సాగించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓటర్లు చైతన్యవంతులయ్యారు. తప్పుడు కేసులు పెట్టి నేతలను జైలుకు పంపడాన్ని వారు ‘పిరికిపంద చర్య‘గా చూస్తున్నారు.
ఢిల్లీ కోర్టు తీర్పుతో బీజేపీ రంగు బయటపడిందనే ప్రచారం పెరిగిపోయింది. అబద్ధపు ప్రచారాలతో ఎంతోకాలం నెట్టుకురాలేమని కూడా తాజా తీర్పు రుజువు చేసింది. ప్రతిపక్ష నేతలను జైలులో ఉంచి, ప్రచారానికి దూరం చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవడం పతనానికి నాంది. కేంద్రం తన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని, ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీయాలని చూస్తే న్యాయస్థానాలు ఊరుకోవు. దర్యాప్తు సంస్థలు పాలకుల బానిసలు కాకూడదు అని కోర్టు పరోక్షంగా హెచ్చరించింది. దర్యాప్తు సంస్థలనేవి పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పని చేయాల్సిన అవసరముంది.
వెంకగారి భూమయ్య




