3 April, 2026 | 3:17 AM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

03-04-2026 01:27 AM

అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ 

మేడ్చల్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి):  ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల  కార్యక్రమంలో భాగంగా గురువారం ఆలియాబాదు, ఎల్లంపేట మున్సిపాలిటిలలోని వార్డు సభలకు మున్సిపల్ ఛైర్మన్లు శిరీషరెడ్డి, శ్రీదేవి లతో కలిసి  అదనపు కలెక్టర్ ఫైజాన్ ఆహ్మద్ ముఖ్య అతిథిగా  హాజరైనారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా,మహాలక్ష్మి, ఉచిత బస్సుసౌకర్యం, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా సాధికారత వంటి పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారికి మరిన్ని కొత్త పథకాలను అందించాలనే సంకల్పంతో గ్రామ సభలను నిర్వహించుకుంటున్నామన్నారు.

జూన్ 2 నుంచి అందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం ఆ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు గ్లాస్ పాలు, మూడు రోజులపాటు రాగి జావా అందించడం,  ఇంటర్ కళాశాలల విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు, దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్  మోటరైజ్డ్  వాహనాల పంపిణీ  వంటి కొత్త పథకాలను   ప్రభుత్వం ప్రవేశపెడుతుందని  అన్నారు.

గ్రామ/వార్డు సభలలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ప్రాథాన్యత క్రమంలో చర్యలు చేపడతామన్నారు.ఈ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారు,ఈ పథకాల గురించి తెలియని వారికి  మీరే ఈ పథకాల గురించి అవగాహన కల్పించి వారు కూడాఈ పథకాలను వినియోగించుకునేలా చూడాలన్నారు. దేశం మొత్తం లో కేవలం తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే మహిళల ప్రయాణం కోసం ఇలాంటి పథకాలు ఉన్నాయని,  వీటిని మహిళలు వినియోగించుకోవాలని కోరారు.

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హత గల ప్రతి ఇంటికి చేరడమే ప్రభుత్వం లక్ష్యమని అందులో భాగంగానే గ్రామ/వార్డు సభలు ఏర్పాటు చేసి  భాగస్వామ్యం చేయడంతో పాటు మీ మీ సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించడమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్లు, వైస్ ఛైర్మన్లు, సంబంధిత తహాసీల్దార్లు, నోడల్ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.