13 March, 2026 | 8:31 PM

అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం -ఎమ్మెల్యే జారె

13-03-2026 05:54 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయం నందు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదర సోదరీమణులకు అందజేస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎంఎల్ఎ జారే మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన కాలమని, ఉపవాసాలు పాటిస్తూ ప్రార్థనలు చేయడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు పరస్పర సహకారం, సోదరభావం పెంపొందుతాయన్నారు. పేద, మధ్యతరగతి ముస్లిం కుటుంబాలు ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రంజాన్ తోఫాను అందజేస్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాస రావు, మందలపల్లి సర్పంచ్ గుజ్జుల శ్రీనివాసరావు, ఎమ్మార్వో రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, చిన్నశెట్టి యుగంధర్, పర్వతనేని ప్రసాద్, అత్తులూరి వెంకట్రామారావు, పగడాల రాంబాబు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.