8 April, 2026 | 11:25 PM

మండల పరిషత్ కార్యాలయంలో వారాంతపు సమీక్ష సమావేశం

08-04-2026 09:22 PM

అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీఓ దిశానిర్దేశం

కల్లూరు,(విజయక్రాంతి): మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వారాంతపు సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించబడింది.ఈ సమావేశంలో త్రాగునీటి సమస్య, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు పథకం,ఉపాధి హామీ పథకం, శానిటేషన్ అంశాలపై సంబంధిత కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో విస్తృతంగా సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి పుష్పలత మాట్లాడుతూ... గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కార్యదర్శులకు ఆదేశించారు.

ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుల గడువు ఈనెల 8తో ముగియనున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, అనుభవ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (అవసరమైన వారికి), వ్యవసాయం లేదా పశుపోషణకు దరఖాస్తు చేసినవారు పట్టాదారు పాస్‌బుక్ నకలు తదితర పత్రాలను నేడు ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు ఏవైనా పత్రాలు మిగిలి ఉంటే వాటిని కూడా గడువులోగా అందించాలని స్పష్టం చేశారు.

దరఖాస్తులు పూర్తి స్థాయిలో సమర్పించని వారి పేర్లు ఎంపిక కమిటీ పరిగణనలోకి తీసుకోబడవని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసినవారు ఈ విషయాన్ని గమనించాలని ఎంపీడీఓ హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు, మార్పులు, మినహాయింపులను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, హౌసింగ్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.