రిజర్వాయర్లున్నా దాహం తీరదా?
మణికొండ, నెక్నాంపూర్‌లో తాగునీటి అక్రమాలు
సామాన్యుడికి చుక్కలేదు.. గేటెడ్ కమ్యూనిటీలకు ఫుల్
విజిలెన్స్ విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్
మణికొండ,(విజయక్రాంతి): మణికొండ, నెక్నాంపూర్ మున్సిపల్ డివిజన్లలో తాగునీటి పంపిణీలో జరుగుతున్న తీవ్ర అక్రమాలు, అసమానతలపై విజిలెన్స్ విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అల్కాపూర్ టౌన్‌షిప్, కృష్ణారెడ్డి ఎన్‌క్లేవ్, ఎల్‌ఐసీ కాలనీలలో కోట్ల రూపాయలతో నిర్మించిన ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు ప్రారంభించినప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ కాలనీలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతుంటే, కొన్ని గేటెడ్ కమ్యూనిటీలకు డిస్ట్రిబ్యూషన్ లైన్లు లేకుండా నేరుగా ట్రంక్ లైన్ల నుంచే బల్క్ కనెక్షన్లు ఇచ్చి నిరంతర నీరు సరఫరా చేస్తున్నారని ఆరోపించింది. మున్సిపాలిటీ వేసిన హై డెన్సిటీ పైప్‌లైన్లు, జలమండలి వ్యవస్థల మధ్య సాంకేతిక లోపాల వల్ల భవిష్యత్తులో నీటి వృథా, లీకేజీలు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు.
తాగునీటి సమాన పంపిణీ ప్రతి పౌరుని జీవన హక్కు అని బీఆర్ఎస్ గుర్తుచేసింది.రిజర్వాయర్ల వినియోగంలో జాప్యం, జంక్షన్ కనెక్టివిటీ పనుల ఆలస్యం, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన బల్క్ కనెక్షన్లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. ఈ అక్రమాలకు కారణమైన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బదిలీ అయిన, పదవీ విరమణ చేసిన అధికారుల ఆస్తులపై విచారణ జరపాలన్నారు. ప్రజలకు న్యాయమైన నీటి సరఫరా అందే వరకు పోరాటం కొనసాగిస్తామని పార్టీ సీనియర్ నాయకులు సీతారం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, ఉపేంద్రనాథ్ రెడ్డి, సంగం శ్రీకాంత్, జై రామ్ తెలిపారు.






