సంగీత కుటుంబానికి అండగా ఉంటాం
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
సంగీత కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల చెక్కు అందజేత
భూపాలపల్లి టౌన్, జులై 31 (విజయ క్రాంతి): సంగీత కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ఇటీవల మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ సంగీత కుటుంబానికి రూ.15 లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు. భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ సంగీత కుటుంబ సభ్యులకు బ్యాంక్ ఆఫ్ బరోడా పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద మంజూరైన రూ.15 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు సంయుక్తంగా అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కానిస్టేబుల్ సంగీత అకాల మరణం పోలీసు శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి పథకాలు ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న సహకారం అభినందనీయమని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు, కానిస్టేబుల్ సంగీత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






