26 May, 2026 | 11:46 AM

పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి

26-05-2026 11:11 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Project) నిర్మాణంలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్ పంప్‌హౌస్, ప్యాకేజీ-3 పనులను పరిశీలించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

సాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు మరమ్మత్తు పనులను పూర్తి చేసేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.