ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు
వాషింగ్టన్: ఇరాన్ పై అగ్రరాజ్యం అమెరికా మళ్లీ దాడులకు(US Attacks on Iran) దిగింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. సీమైన్లు అమర్చే పడవలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని అమెరికా సైన్యం తెలిపింది. ఇరాన్ తో శాంతి ఒప్పందం ఉన్న దృష్ట్యా నిగ్రహం పాటించామని అమెరికా సైన్య ప్రకటించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతం అమెరికా సైన్యం దాడులు, పేలుళ్లతో మార్మోగింది.
అమెరికా, ఇజ్రాయెల్‌లతో మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కుదిరే అవకాశం ఉన్న ఒప్పందంపై ఖతార్ ప్రధానమంత్రితో చర్చల కోసం టెహ్రాన్ అగ్ర ప్రతినిధులు దోహాలో ఉన్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. ఇరాన్ దళాల నుండి ఎదురయ్యే ముప్పుల నుండి మన సైనికులను కాపాడటానికి, ఆత్మరక్షణలో భాగంగానే ఈ తాజా దాడులు జరిపినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఒక ప్రకటనలో తెలిపింది. క్షిపణి ప్రయోగ స్థావరాలు, మైన్లు అమర్చడానికి ప్రయత్నిస్తున్న పడవలు లక్ష్యాలలో ఉన్నాయని ఆ యూఎస్ ఏజెన్సీ పేర్కొంది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ, "కొనసాగుతున్న కాల్పుల విరమణ సమయంలో అమెరికా సైన్యం సంయమనం పాటిస్తూనే తమ బలగాలను కాపాడుకుంటూనే ఉంది" అని అన్నారు.






