24 August, 2026 | 1:15 AM

రిజర్వేషన్లను ఎత్తి వేస్తే ఊరుకునేది లేదు

24-08-2026 12:24 AM

కేంద్రంపై బీసీ నేతలు ఒత్తిడి తేవాలి

నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా 

ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): దేశంలో బడుగు, బలహీన వర్గాలకు అమలవు తున్న రిజర్వేషన్లను ఎత్తివేయాలని కేంద్రం ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు అన్నారు. 60 శాతం జనాభా ఉన్న బీసీల రిజర్వేషన్లను ఎలా తొలగిస్తారో చూస్తామని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు.

కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహిస్తునున్నట్లు ఆయన తెలిపారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలనే ప్రయత్నాల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారని హనుమంతరావు ఆరోపించారు. రిజర్వేషన్లు తొలగిస్తే బీజేపీ నాయకులను ప్రజలు రోడ్లపై తిరగనివ్వరని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా బీజేపీలో ఉన్న బీసీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీల పక్షపాతిగా పనిచేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజల్లో పెరుగుతున్న మద్దతుతో బీజేపీ ఆందోళన చెందుతోందన్నారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం తెలంగాణ నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హనుమంతరావు ప్రకటించారు. సోమవారం ఈ ధర్నాకు పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.