23 August, 2026 | 8:48 PM

పాత నేతలకే 80 శాతం నామినేటెడ్ పదవులు

23-08-2026 08:30 PM

కొత్త నేతలకు 20 శాతం పదవులు 

గతంలో జరిగిన చిన్నపాటి తప్పిదాలు జరగనివ్వం 

టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 

నిజామాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు 80% నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో చిన్న తప్పిదాలు జరిగాయని ఈసారి తప్పిదాలు జరగకుండా చూస్తామన్నారు. పార్టీల్లోకి వచ్చిన కొత్త నేతలకు 20 శాతం పదవులు ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని  ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ నేతలు ఆందోళన చెందవద్దని అన్నారు. మీ కష్ట ఫలితం వల్లే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. మీ త్యాగాలను పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు తప్పకుండా గుర్తింపు కల్పిస్తామన్నారు.

సెప్టెంబర్ లో నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు ఇతర పదవులను కూడా పాత కేడర్కు కట్టబెడతామన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డా, నిబద్ధతగల క్యాడర్కు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామన్నారు. గతంలో జరిగిన పదవుల కేటాయింపుల్లో చిన్నపాటి తప్పిదాలు జరిగాయని ఈసారి అలా జరగకుండా చూస్తామన్నారు. ఈసారి క్రమశిక్షణ, నిబద్ధతగల కార్యకర్తలకు పదవుల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి100 సీట్లు సాధించి తీరుతామన్నారు.

మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజేక్కించుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రతి కార్యకర్త తీసుకెళ్లాలని సూచించారు. నిజామాబాద్ అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తామన్నారు. జిల్లా నో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర కీలకమన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ వచ్చిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయంలో జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలలో తీసుకొచ్చామన్నారు. తరగతులు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. భీంగల్ లింబాద్రిగుట్టపై గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అత్యధికంగా నిజా మాబాద్ జిల్లాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాదులో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఓ వైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి చేపడుతూ కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. సహకార సంఘాల్లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు చైర్మన్ పదవులను డైరెక్టర్ పదవులను ఇవ్వనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా తీర్చి దిద్ద లేని వారు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు.

మరి కొందరు సంస్కారహీనంగా మాట్లాడడం సరి కాదన్నారు. విమర్శలకు సమాధానం అభివృద్ధి రూపంలో చూపెడతామన్నారు. ఆర్మూర్ కు త్వరలో పామాయిల్ పరిశ్రమ రాబోతుందన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ మేటి జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా అభివృద్ధిని ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ప్రభుత్వం, పార్టీ కలిసి ముందుకు వెళ్తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు రామకృష్ణ, నగేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ తాయేర్ బిన్ ఉందా న్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు  విపుల్, తదితరులు పాల్గొన్నారు.