హరీష్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం
- బుస్సాపూర్ అభివృద్ధి హరీష్ రావు కృషి ఫలితం
- మాజీ ఎంపీపీ ఎర్ర యాదయ్య హెచ్చరిక
సిద్దిపేట రూరల్, మే 7: అభివృద్ధి ప్రదాత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని సిద్దిపేట మాజీ ఎంపీపీ ఎర్ర యాదయ్య హెచ్చరించారు. గురువారం సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నాయకత్వంలోనే బుస్సాపూర్ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి రోడ్లు, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. బుస్సాపూర్ మాజీ సర్పంచ్ సదాశివ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, గతంలో హరీష్ రావు వద్దకు వెళ్లి పనులు చేయించుకున్న వ్యక్తి ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎర్ర యాదయ్య విమర్శించారు. హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంలా చూసుకుంటూ ప్రజా సేవలో ముందుంటారని కొనియాడారు.
గ్రామానికి హరీష్ రావు చేసిన సేవలు ప్రజలకు బాగా తెలుసునని, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. ఇకపై హరీష్ రావుపై నిరాధార ఆరోపణలు చేస్తే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పత్తి ఐలారెడ్డి ఉప సర్పంచ్ శివయ్య వార్డు సభ్యులు గ్రామ బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






