సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం
- ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి
- డీజీపీ బీ శివధర్ రెడ్డి
కరీంనగర్, ఏప్రిల్ 24(విజయక్రాంతి): రాష్ట్రంలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని డీజీపీ బీ శివధర్ రెడ్డి తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో రూ.2 కోట్ల 50 లక్షలతో ఎకరం స్థలంలో ఆధునిక హంగులతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డీజీపీ బీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిజం అంతమైందని స్పష్టం చేశారు.
రాష్ట్ర పోలీసింగ్‌లో నూతన మార్పులు తీసుకువ స్తామని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకమైనవి అన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించేలా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి హోమ్ శాఖ నిర్వహిస్తూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
డ్రగ్స్ నిర్మూలనకు దాడులు చేస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ఇటీవల ప్రారంభించామని గుర్తు చేశారు. అరైవ్.. అలైవ్ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.తాను కోరిన వెంటనే రుద్రంగికి సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్ మంజూరు చేశారని వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనులు రూ.150 కోట్లతో కొనసాగుతున్నాయని అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మెన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాభాయ్, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్లు పుష్పలత, జయంత్ కుమార్, సీఐ వెంకటేశ్వర్లు, సీఐ లు, ఎస్‌ఐలు, సర్పంచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.






