25 April, 2026 | 3:23 AM

శంకర్ గౌడ్ మృతితో ఆందోళన ఉధృతం

25-04-2026 01:35 AM
  1. అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో  నిరసన
  2. అమరవీరుల స్థూపం వద్ద నివాళి

కరీంనగర్, ఏప్రిల్24(విజయక్రాంతి):తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలంటూ  గురువారం ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(55) మృతిచెందారు. శుక్రవారం తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.  ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు  ఆర్టీసీ కార్మికులు అన్ని డిపోవద్ద శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించి నిరసనకు దిగారు.కరీంనగర్ లో కార్మికులు ర్యాలీ నిర్వహించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించి ఆందోళనకు దిగారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికులు చేపడుతున్న సమ్మె ముడవరోజు ఉదృతం అయ్యింది . బస్సులు అప్పడొకటి.. ఇప్పుడొకటి నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా డిపోల ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కరీంనగర్ డిపో ఎదుట కార్మికులు గేట్ ధర్నా నిర్వహించారు. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా ప్రైవేట్ హైర్ బస్సులతో పాటు, జెబిఎం ఎలక్ట్రిక్ బస్సులు యథావిధిగా నడిపించే ప్రయత్నం  చేశారు.

ఆర్టీసీలోని సంఘాలన్ని సమ్మెకు మద్ధతు తెలపడంతో ముడవరోజు రోజు సమ్మె సక్సెస్ అయ్యింది. కరీంనగర్ రీజియన్ వ్యాప్తంగా 550 బస్సులు (65 శాతం) బస్సులను నడిపించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు శుక్రవారం  శంకరయ్య గౌడ్ మృతికి సంతాపం  ప్రకటించి హుటాహుటిన నర్సంపేట కు వెళ్లారు.

ప్రైవేట్ వాహనాల జోరు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలు జోరుగా నడిచాయి. కరీంనగర్ నుండి అన్ని రూట్లలో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులను చేరవేస్తున్నారు. కార్లు, టాటా ఏసీ వాహనాలు, ఆటోలు, జీపులు తదితర వాహనాల్లో ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించారు. ప్రైవేట్ వాహనాల్లో ఛార్జీలను సైతం కొంత మేర పెంచి వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.