ప్రహరీ లేని బడులు
- గతేడాది భారీ వర్షాలకు కూలిన గోడలు
- పట్టించుకోని అధికారులు
- ఆవరణలోకి వస్తున్న పశువులు
- రాత్రి పూట అసాంఘిక కార్యక్రమాలు
మహబూబాబాద్, జులై 2౩ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు కరువయ్యాయి. జిల్లావ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో తోపాటు కొన్ని గురుకులాలకు కూడా సరైన ప్రహరీ గోడలు లేకుండా పోయాయి. గత రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన ప్రహరీ గోడలు కూలిపోయాయి. అలాగే కొన్నిచోట్ల ప్రహరీ గోడలు నిర్మించలేదు.
దీనితో పాఠశాల ఆవరణలోకి పశువులు రావడంతో పాటు రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గత ప్రభుత్వ హాయములో మన ఊరు మనబడి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కొన్నిచోట్ల నిధులు కేటాయించి ప్రహరీ గోడలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ చాలా చోట్ల ప్రహరీ గోడలు నిర్మించలేదు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలకు సరైన రక్షణ లేకుండా పోయింది.
పాఠశాల ఆవరణలో మొక్కలు పెంచుకోవడంతోపాటు సౌకర్యాల రక్షణ కోసం ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు తమ పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్న, ప్రహరీ గోడలు, గేటు లేకపోవడంతో పశువులు వచ్చి మేసే అవకాశం ఉందని వెనక్కి తగ్గుతున్నారు.
మరికొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ లేకపోవడంతో ఇష్టానుసారంగా కొందరు ప్రవేశించి, పంచాయతీలు, ఫంక్షన్లు నిర్వహిస్తున్నారని, అనంతరం అక్కడ చెత్తాచెదారాలను అలాగే వదిలివేసి వెళ్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వ విద్యాలయాలకు నలువైపులా ప్రహరీ గోడ, గేటు లేకపోవడం వల్ల విద్యాలయాల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని చెబుతున్నారు.
జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రభుత్వ విద్యాలయాల పరిస్థితి ఇదే తరహాలో ఉందని, కొన్నిచోట్ల ప్రహరీ గోడ ఉన్నప్పటికీ గేట్లు లేకపోవడంతో రక్షణ కరువైందని చెబుతున్నారు. ప్రహరీ గోడ నిర్మించి గేటు ఉంటే విద్యాలయాలకు రక్షణగా ఉంటుందని, ప్రభుత్వం స్పందించి జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ప్రభుత్వ విద్యాలయానికి ప్రహరీ గోడలు నిర్మించి, గేట్లు ఏర్పాటు చేసి పాఠశాలల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






