యువత భవిష్యత్తుతో చెలగాటం వద్దు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై చేర్యాలలో కాంగ్రెస్ పార్టీ ధర్నా రాస్తారోకో
చేర్యాల, జూన్ 23: జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు చేర్యాల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం చేర్యాల నేషనల్ హైవే పై ధర్నా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా చేర్యాల పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ మాట్లాడుతు లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతకు అండగా నిలిచినందుకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






