2 March, 2026 | 1:53 AM

ఏజెన్సీ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తాం..

01-03-2026 11:31 PM

రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీతక్క.

వెంకటాపురం(నూగూరు),మార్చి1(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాత ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కలు తెలిపారు. ఆదివారం మండల పర్యటనకు వచ్చిన వారు స్థానిక కాఫీ గ్రౌండ్ ఆవరణలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను అన్ని రంగాల్లో ఆదుకునేందుకు ఈ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

గత పది సంవత్సరాల ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నదని తెలిపారు. ధనిక తెలంగాణగా ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చిందన్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా ప్రజలకు సేవ చేసేందుకు ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నదని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నదన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేద ప్రజలను తీవ్రంగా మోసం చేసి అర్హులైన వారికి ఇళ్లను కేటాయించ లేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు ఈ ఏడాది మొదటి విడతలు 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు. రెండో విడతలోనూ ఈ ప్రాంతంలో అర్హులైన వారందరికీ అదనంగా ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.