16 July, 2026 | 12:38 PM

ఉప్పుంతలలో వీధికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు

16-07-2026 12:28 PM

* బాధితులను పరామర్శించిన గ్రామ సర్పంచ్ చింతగల శ్రీనివాసులు

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో కుక్క దాడి చేసి ఐదుగురు గాయపడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామంలోని పలువురిపై ఒక్కసారిగా కుక్క దాడి చేయడంతో వారు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచు చింతగల శ్రీనివాసులు బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వారికి చికిత్స అందించారు. బాధితులకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు అందించి, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. గ్రామంలో వీధికుక్కల సమస్యను నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అధికారులను కోరారు.